calender_icon.png 24 April, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

27న భూపాలపల్లిలో మెగా జాబ్ మేళా

24-04-2025 05:23:59 PM

87 కంపెనీల రాక..

రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరు..

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వెల్లడి..

కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): ఈనెల 27న భూపాలపల్లిలో నిర్వహించతలపెట్టిన భారీ మెగా జాబ్ మేళాలో అధిక సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొనాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జరిగే మెగా జాబ్ మేళా కార్యక్రమానికి వచ్చే యువతకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. గురువారం ఏర్పాట్లుపై రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, పరిశ్రమలు, వైద్య, విద్య, ఆర్టిఓ, సింగరేణి, జెన్కో అధికారులతో సమావేశం నిర్వహించారు.

నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి సుమారు పదిహేను వేల మంది నిరుద్యోగ యువత జాబ్ మేళాకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఏర్పాట్లుపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా 7,624 మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాల నుండి జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి రవాణా సౌకర్యం ఏర్పాటుతో పాటు మంచి నీరు, మజ్జిగ, అల్పాహారం తదితర ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్ప గ్రాండ్ లో మంచినీరు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని సింగరేణి జీఎంకు సూచించారు.

ఎందరో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యక్రమంగా భావించి అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఉపాధి లభించక చదువుకున్న యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని, వారిని సన్మార్గంలో నడిపించాల్సిన భాద్యత మనందరిపై ఉందని, యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం  చేసుకుని, ఆర్థికంగా బలోపేతం అవుతారని సూచించారు. వేసవి దృష్ట్యా అత్యవసర మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అంబులెన్స్ ఏర్పాటుతో పాటు ప్రధాన ఆసుపత్రిలో అత్యవసర బెడ్లు అందుబాటులో ఉంచాలని  వైద్యాధికారులకి సూచించారు. కొంతమంది ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోలేని వారి కోసం.. అదే రోజు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు.

అందుకు కంపెనీల వారీగా ఖాళీలను తెలిపే విధంగా పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. టాస్క్ కంపెనీ ప్రతినిధులు ఒకరోజు ముందుగానే హైదరాబాద్ నుండి భూపాలపల్లికి వచ్చే అవకాశం ఉన్నందున సింగరేణి, జెన్కో అధికారులు వారికి వసతితో పాటు భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. 87 కంపెనీలు వస్తున్నట్లు సమాచారం ఇచ్చారని, పెరిగే అవకాశముందని తగినట్లు ఏర్పాట్లు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. జాబ్ మేళా విజయవంతానికి గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, మండల స్థాయిలో ఎంపీడీవో, ఎమ్మార్వో, జిల్లా స్థాయిలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ కన్వీనర్ గా ఉంటారన్నారు. మనందరం సమష్టి బాధ్యతగా సమన్వయం చేసుకుంటూ ఇట్టి జాబ్ మేళాను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సింగరేణి జిఎం రాజేశ్వర రెడ్డి, జెన్కో సీఈ శ్రీ ప్రకాశ్, డిపిఓ నారాయణరావు, డిఆర్డీఓ నరేష్, జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, పరిశ్రమల జిఎం సిద్దార్థ, క్రీడల అధికారి రఘు, ఆర్టిఓ సంధాని, డీఈవో రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.