01-04-2025 09:15:38 PM
మందమర్రి (విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14న సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఎస్సీ ఎస్టీ ఆఫీసర్స్ అసోసియేషన్, దళిత సంఘాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించాలని తలసేమియా సికిల్ సేల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ కోరారు. సింగరేణి వ్యాప్తంగా మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం ఏరియాల వ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించి తల సేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని కోరారు. మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు 832 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారని వీరందరికీ ప్రతి 15 రోజులకొకసారి రక్తము అందించాల్సి ఉంటుందని ఆన్నారు.
మంచిర్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో రక్తం అవసరం ఉన్న ప్రతి పేషెంట్ కు కిడ్నీ డయాలసిస్, గర్భిణీ స్త్రీలకు, రక్తహీనత వారికి, శస్త్ర చికిత్సలు అవసరం ఉన్న వారందరికీ మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచితంగా రక్తాన్ని అందించబడుతుందన్నారు. ప్రస్తుతం వేసవిలో కాలేజీ విద్యార్థులకు పరీక్షల సమయం, అనంతరం విద్యాసంస్థలకు సెలవులు ఉండటంతో రక్తము కొరత తీవ్రంగా ఉందని, వీరికి రక్తము దొరకకపోతే మృతి ఒడిలోకి చేరుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఎస్సీ ఎస్టీ ఆఫీసర్స్ అసోసియేషన్ ద్వారా మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించి తల సేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.