26-03-2025 06:39:39 PM
ప్రశంసించిన కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్...
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి సోమ గూడెం పరిధిలోని కల్వరి చర్చిలో బుధవారం పాస్టర్ ప్రవీణ్, షారోన్ దంపతులు నిర్వహిస్తున్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం పాస్టర్ ప్రవీణ్, షారోన్ దంపతులు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. ఈసారి కూడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ కుమార్ దీపక్ ప్రశంసించారు. వేసవికాలంలో రక్తం దొరకక, తల సేమియా, చికెన్ సెల్ రోగులతో పాటు అనేకమంది ప్రాణాపాయ పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్నారని ఇటువంటి పరిస్థితులలో ప్రవీణ్ షారోన్ దంపతులు తమ ఫౌండేషన్ ద్వారా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం స్ఫూర్తిదామని అన్నారు.
2016 నుంచి అనేకసార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించిన పాస్టర్ ప్రవీణ్ షారోన్ ఫౌండేషన్ బెల్లంపల్లి ప్రాంతంలో రక్తహీనతతో బాధపడుతున్న తల సేమియా, సికిల్ సెల్ రోగులకు ప్రాణదాతలుగా నిలుస్తుందని వినిందించారు. మెగా రక్తదాన శిబిరానికి వచ్చిన బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావడం ప్రశంసనీయమని కొనియాడారు. రాబోయే రోజుల్లో బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని కలెక్టర్ కుమార్ దీపక్ హామీ ఇచ్చారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సిస్టర్ షారోన్ చెప్పారు.
నిరుపేదల ఆకలి తీర్చేందుకు నిత్యం అన్నదానం చేపట్టనున్నట్లు తెలిపారు. గత 20 ఏళ్లుగా ఉచిత వైద్య శిబిరాలతో పాటు పేద విద్యార్థులకు అవసరమైన వస్తువుల పంపిణీ, బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తూ వస్తున్నామని ఇప్పటివరకు వందలాది యూనిట్ల రక్తాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కి అందజేశామని చెప్పారు. బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 83 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఆమె స్పష్టం చేశారు. రక్తదాన శిబిరంలో బెల్లంపల్లి ఆర్డీవో పి. హరికృష్ణ, మాజీ జెడ్పిటిసి సభ్యులు కారుకూరి రామ్ చందర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముత్తినేని రవికుమార్ రెడ్ క్రాస్ సభ్యులు కాసర్ల శ్రీనివాస్ కాసాల రంజిత్ తో పాటు మందమర్రి సిఐ కె.శశిధర్ రెడ్డి, కాసిపేట ఎస్సై వొళ్ళాల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.