calender_icon.png 18 January, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘హర్ ఘర్ తిరంగా’పై నేడు సమావేశం

06-08-2024 01:06:10 AM

హాజరు కానున్న బీజేపీ పదాధికారులు, వివిధ జిల్లాల అధ్యక్షులు

దిశానిర్దేశం చేయనున్న కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): హర్ ఘర్ తిరంగా పేరిట ఈ నెల 9 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతున్నది. కార్యాచరణపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి  బుధవారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, పార్టీ వివిధ జిల్లాల అధ్యక్షులకు దిశానిర్దేశం చేయనున్నారు.

పార్టీ నాయకులు ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కేంద్ర మంత్రి సమావేశంలో రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలపైనా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రుణమాఫీ అందని అన్నదాతల కోసం బీజేపీ ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హెల్ప్ డెస్క్, హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది.

ఇప్పటికే ఎంతో మంది రైతులు రుణమాఫీ అందలేదని బీజేపీ కార్యాలయానికి వచ్చి గోడు వెల్లబోసుకున్నారని, వారికి న్యాయం  జరిగేలా చూస్తామని పార్టీ నేతలు భరోసా ఇచ్చినట్లు బోగట్టా. ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పినట్లు తెలిసింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలూ సన్నద్ధం కావాలని కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిస్తారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

దీంతోపాటు రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపైనా పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తారని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనా చర్చిస్తారని సమాచారం. పార్టీ ఇప్పటికే మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.