calender_icon.png 23 December, 2024 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో సెర్చ్ కమిటీల భేటీ!

07-09-2024 12:14:28 AM

ఒకటిరెండు రోజుల్లో షెడ్యూల్ 

వర్సిటీలకు వీసీల నియామక ప్రక్రియ వేగవంతం

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామక ప్రక్రియ వేగవంతమైంది. సెర్చ్ కమిటీల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీసీల పదవీ కాలం ఈ ఏడాది మే 21తో ముగిసింది. ప్రస్తుతం వర్సీటీలకు ఐఏఎస్ అధికారులు ఇన్‌చార్జి వీసీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే కొత్త వీసీల నియామకానికి సంబంధించి మే 17నే సెర్చ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఆ కమిటీల సమావేశాల తేదీలు ఇంతవరకూ ఖరారు 

 చేయలేదు. కొన్ని నెలలుగా వీసీల నియామక ప్రక్రియ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమించాలని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సెర్చ్ కమిటీ సమావేశాల తేదీలను సీఎస్ శాంతికుమారి ఖరారు చేయడంలో నిమగ్నమయ్యారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికే పది యూనివర్సిటీలకు వేర్వేరుగా సెర్చ్ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఒక్కో వర్సిటీకి సంబంధించిన సెర్చ్ కమిటీలో ముగ్గురు సభ్యులుంటారు.

అందులో యూజీసీ నామినీ, రాష్ట్ర ప్రభుత్వ నామినీ (సీఎస్), యూనివర్సిటీ నామినీ ఉంటారు. ఈ కమిటీల్లో సీఎస్ కూడా ఉండడంతో తానే స్వయంగా సమావేశాల తేదీలను ఖరారు చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో తేదీలను ప్రకటించే అవకాశముంది. ఈ భేటీలు ఒక్కసారి ఖరారైతే వీసీల జాబితా రెడీ అయినట్టే. ఒక్కో యూనివర్సిటీ నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన కమిటీ ఆ తర్వాత ముగ్గురు చొప్పున పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తుంది.

ఆ జాబితాను గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపిస్తోంది. ఫైనల్‌గా గవర్నర్ ఆమోదంతో వీసీల పేర్లను ప్రకటిస్తారు. సెర్చ్ కమిటీల భేటీకి యూజీసీ నామినీలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సమావేశాల తేదీలు సైతం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ తేదీలను ఖరారు చేస్తూ ప్రకటించనున్నారు. 

వీసీల పోస్టులకు తీవ్ర పోటీ..

  వీసీల పోస్టుల కోసం ప్రభుత్వం గతంలోనే దరఖాస్తులను ఆహ్వానించింది. ఉస్మానియా యూనివర్సిటీకు 193, కాకతీయ వర్సిటీకు 149, పాలమూరు వర్సిటీకు 159, శాతవాహనకు 158, మహాత్మాగాంధీ వర్సిటీకు 157, తెలంగాణ వర్సిటీకు 135, జేఎన్టీయూకు 106, తెలుగు వర్సిటీకు 66, జేఎన్‌ఏఎఫ్‌ఏయు (ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ)కు 51, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకు 208 దరఖాస్తులు వచ్చాయి.పది యూనివర్సిటీల నుంచి మొత్తం 1,382 దరఖాస్తులు రాగా, 320 మంది పోటీపడ్డారు. అయితే వీసీల పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. సామాజిక వర్గాల వారీగా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది.