- సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌లో..
- రేవంత్‌రెడ్డి, చంద్రబాబు భేటీ
- పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలపై చర్చలు
- 9, 10 షెడ్యూల్‌లోని అంశాల పరిష్కారానికి యత్నం
హైదరాబాద్, జూలై ౫(విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు హైదరా బాద్‌లోని ప్రజాభవన్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిలు సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించేందుకు ఇద్దరు సీఎంలు భేటీ అవుతున్నారు.
ప్రధానంగా షెడ్యూల్ షెడ్యూల్ ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. ఇక విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపైన అంశం కూడా చర్చకు రానున్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం తెలంగాణకు దాదాపు రూ. 24 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, రూ. 7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ చెబుతోంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం బాధ్య తలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
కాగా, మార్చి నెలలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్‌కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా విడిపోయింది. ఇప్పటివరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబిడే కమిటీని వేసింది.
వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి ఎలాంటి అభ్యంతరాల్లేవని కమిటీ తేల్చింది. ఇక 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రధానంగా ఆర్టీసీ, ఎస్‌ఎఫ్‌సీ లాంటి వాటిపైన ఏకాభిప్రాయం రాలేదు. పదో షెడ్యూల్‌లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి.
హైదరాబాద్‌లోని భవనాలపై..
హైదరాబాద్‌లోని భవనాలు, క్వార్టర్స్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. లేక వ్యూ అతిథిగృహం, సీఐడీ కార్యాలయం, హెర్మిటేజ్ కాంప్లెక్స్ ఏపీ అవసరాల కోసం కేటాయించారు. జూన్ రెండో తేదీతో రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయినందున.. వాటిని స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో అధికారులను ఆదేశించారు. అయితే ఇంకా విభజన సమస్యలు పూర్తిగా కొలిక్కి రానందున ఆ భవనాలు తమకు కొనసాగించాలని ఏపీ కోరుతోంది. మంత్రుల నివాస సముదాయం, ఐఏఎస్ క్వార్టర్స్, ఎంప్లాయిస్ క్వార్టర్స్ కూడా ఏపీకి కేటాయించారు.
విద్యుత్ బకాయిలపై..
విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల అంశంపైన రెండు రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి. స్థానికత, ఆప్షన్స్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగులు పరస్పర మార్పు అంశం చాలా రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉంది. ఏపీ స్థానికత కలిగిన 1,853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అశంతోపాటు పౌరసరఫరాల శాఖకు చెందిన పుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ అంశం కూడా ప్రస్తావనకు రానుంది. విద్యుత్ బకాయిల అంశం రెండు రాష్ట్రాల మధ్య చాలా రోజులుగా పెండింగ్‌లోనే ఉన్నది. తమకు బకాయిలు రావాలని రెండు రాష్ట్రాలు గణాంకాలతో సహా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశం కూడా సీఎంల సమావేశంలో ప్రస్తావనకు రానుంది.
ఏపీలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలపైన..
రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలానికి అనుకుని ఉన్న ఐదు గ్రామాలను ఏపీకి కేటాయించారు. ఏపీ నుంచి తెలంగాణకు కేటాయించాలన్న అంశం కూడా ప్రస్తావనకు రానున్నది. ఏపీలో విలీనమైన ఏటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామ పంచాయతీలను స్థానికంగా ఉన్న ఇబ్బందులు, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని భద్రాచలంలో కలపాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. గతంలోనే ఐదు గ్రామ పంచాయతీలు కూడా తీర్మాణాలు చేశాయి. సీఎంల భేటీలో ఐదు గ్రామ పంచాయతీలపైన చర్చించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు ఐదు గ్రామ పంచాయతీలకు సంబంధించి రెవెన్యూ శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది.