28-02-2025 10:08:23 PM
రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించాలని వినతి...
ఎల్బీనగర్: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ కలాన్ 201/1 సర్వేనెంబర్ లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని గుర్రంగూడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుంచి వనస్థలిపురం సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు ఉత్తరం రావడంతో సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని కాలనీవాసులు ఇటీవల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. సమస్య తీవ్రతను గుర్తించిన ఎమ్మెల్యే.. జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్ రెడ్డి, రేంజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి, సమస్యను వివరించారు. సాహేబ్ నగర్ కలాన్ స్థలం అటవీ భూమి కాదని, గతంలో హుడా లేఔట్ కోసం 77 ఎకరాలకు ఫారెస్ట్ అధికారులు ఎన్వోసీ ఇచ్చారని, అలాగే 118 జీవో ప్రకారం కన్వినియన్స్ డీడ్ సైతం ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే సూచనలతో శుక్రవారం వివిధ కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు సైఫాబాద్ లోని అరణ్య భవన్ లో డీ ఎఫ్ వో సుధాకర్ రెడ్డిని కలిసి సమస్యను వివరించారు.
ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు మాట్లాడుతూ... ఎవరూ ఆందోళన చెందొద్దని, 201/1 సర్వే నెంబర్ల లోని బీఎన్ రెడ్డి నగర్, ఎస్ కే డీ నగర్, శ్రీరామ నగర్ కాలనీ స్థలాలకు కోర్టు కేసు వర్తించదని, కేవలం 102 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ పైనే ప్రైవేట్ వ్యక్తులు కోర్టులో కేసు వేశారని తెలిపారు. కేసు ఉండడంతో ఫారెస్ట్ అధికారులు స్పందించి, స్థలం అన్యాక్రాంతం కాకుండా ముందు జాగ్రత్త చర్యగా రిజిస్ట్రేషన్ చేయకూడదని సబ్ రిజిస్టర్ కు లేఖ రాశారని వివరించారు. కేవలం 102 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు నిలిపివేసి, మిగతా కాలనీల్లో రిజిస్ట్రేషన్స్ పునరుద్ధరించాలని జిల్లా ఫారెస్ట్ అధికారిని కోరారు. కార్యక్రమంలో బీఎన్ రెడ్డి నగర్ కాలనీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, ఎస్ కేడీ నగర్ కాలనీ గౌరవాధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, సెక్రటరీ సుధాకర్ రెడ్డి, వైదేహినగర్ నార్త్ కాలనీ అధ్యక్షుడు పోగుల రాంబాబు, బీఎన్ రెడ్డి నగర్ పోచమ్మ ఆలయ చైర్మన్ ప్రదీప్ రెడ్డి, కొత్త భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.