calender_icon.png 29 October, 2024 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు కులగణనపై గాంధీభవన్‌లో మీటింగ్

29-10-2024 01:53:54 AM

  1. హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
  2. రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లపై చర్చ 

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయాలని నిర్ణయం తీసుకోవడంతో.. పార్టీ పరంగా ప్రజలకు వివరించేందుకు పీసీసీ సమాయత్తమవుతోంది. త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో సభ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నారు.

అన్నీ కుల సంఘాల నేతలు, మేధావులు, ఉద్యమకారులతో నిర్వహించే ఈ సభకు రాహుల్‌గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని టీ పీసీసీ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, జార్ఖాండ్ ఎన్నికల నేపథ్యంలో వీలు చూసుకొని వస్తానని రాహుల్‌గాంధీ హామీ ఇవ్వడంతో.. మొదటగా ఈ నెల 30న గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో పాటు పార్టీకి చెందిన సీనియర్లు పాల్గొననున్నారు. నవంబర్ 4 నుంచి 19 వరకు కులగణన సర్వే నిర్వహించాలని, నవంబర్ 30లోగా సర్వేపూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.