calender_icon.png 23 September, 2024 | 3:54 PM

ఖాళీ అవుతున్న మీర్‌పేట్ పెద్ద చెరువు

23-09-2024 01:22:52 AM

ఎస్‌ఎన్‌డీపీ నాలాలో నుంచి బయటకు వెళ్లిపోతున్న నీరు

స్పందించని అధికారులు

మహేశ్వరం, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాల కు రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పెద్ద చెరువు నిండుకుండలా మారింది. అయితే, ఈ చెరువు నీటితో కళకళలాడడం మూడు రోజుల ముచ్చటగానే మిగిలింది. చెరువులోని నీరు ఎస్‌ఎన్‌డీపీ నాలాలో నుంచి ఉధృతంగా బయటకు వెళ్లిపోతోంది. అయినప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్ శాఖల్లో ఏ ఒక్క శాఖ అధికారి పట్టించుకోవడం లేదు. ఇలానే కొనసాగితే రెండు, మూ డు రోజుల్లో చెరువు ఖాళీ కావడం ఖాయం గా కనిపిస్తోంది. ఇదే కోవలో మంత్రాల చెరువు, చందన చెరువు పరిస్థితి కూడా ఉన్నట్లు సమాచారం.

నాలాల ద్వారా బయటకు..

ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చెరువులోకి చేరుకునే క్రమంలో సమగ్ర వర్షపు నీటి వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక నిధులను మంజూరు చేసి రాంకీ సంస్థకు పనులను అప్పగించింది. మీర్‌పేట్ పెద్ద చెరువులోకి గొలుసుకట్టుగా వచ్చే కాల్వలను సర్వే చేసి ఎస్‌ఎన్‌డీపీ నాలాలను చెరువులో కట్ట వరకు నిర్మించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ నాలాల నుంచి నేరుగా వరద నీరు చెరువులోకి చేరుకుంటుంది. ఇలా నిర్మించిన నాలాలు చెరువును నింపడానికి కాకుండా ప్రస్తుతం చెరువులో నీటిని ఖాళీ చేస్తున్నాయి.

నాలుగు రోజులుగా చెరువులో నీరు నాలాలో నుంచి ట్రంక్ పైపులైన్లకు చేరుకొని నేరుగా డ్రైనేజీ పైపుల్లో మురుగునీరుతో కలిసి మూసీనదిలో కలిసిపోతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే నాలుగైదు రోజుల్లో చెరువు ఖాళీ కావడం ఖాయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు సమాచారం అందించినా.. మరో శాఖ అధికారులు చూసుకోవాలి మాకేం సంబంధం లేదని చెబుతుండడంతో స్థానికులు మండిపడుతున్నారు.

కోట్ల రూపాయలు ఖర్చు చేశారు

ఎస్‌ఎన్‌డీపీ నాలా ద్వారా గొలుసుకట్టు చెరువుల నుంచి పెద్ద చెరువులోకి నీరు నింపడానికి కోట్ల రూపాయాలు ఖర్చు చేశారు. కానీ అవేమీ ఫలితాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు చెరువులో నుంచి నీరు భారీగా బయటకు వెళ్లిపోతోంది. ఇలాగే కొనసాగితే వచ్చే ఎండాకాలంలో చెరువులో చుక్క నీరు ఉండదు. చుట్టుపక్కల బోర్లు పనిచేయవు. 

 ఇంద్రవత్ రవి,

మీర్‌పేట్ కార్పొరేటర్