03-03-2025 01:17:58 AM
హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్‌గా మీనాక్షినటరాజన్ రాకతో పార్టీలో మార్పు మొదలైంది. పైరవీలకు తావులేకుండా పార్టీ కోసం పనిచేసేవారికే పదవుల పంపకంలో సముచిత స్థానం ఉంటుందని పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో మీనాక్షి స్పష్టం చేయడంతో.. క్షేత్రస్థాయిలో పనిచేసే క్యాడర్‌లో భరోసా కనిపిస్తోంది.
సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. పార్టీ లైన్‌దాటి ఎవరైనా వ్యవహరిస్తే వేటు తప్పదనే సంకేతాలను పంపా రనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో ప్రభుత్వం, పార్టీలోని నాయకులు తీరులో మార్పు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పీసీసీ విస్తృతస్థాయి సమా వేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ, ఇక జిల్లాల వారీగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
అందులో భాగంగానే ఈ నెల 4న మెదక్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో పాత, కొత్త నాయకుల మధ్య సఖ్యత కరువైందని, వాటిని పరిష్కరించే దిశగా ఆలోచన చేయలేదని విమర్శలు ఉన్నాయి. వీటన్నింటికీ చెక్‌పెట్టేందుకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ నేత లందరితో సమావేశం కావాలని నిర్ణయించారు.
మొన్నటివరకు ఇన్‌చార్జ్‌గా వ్యవహ రించిన దీపాదాస్ మున్షీ ఇవేమి పట్టించుకోలేదని.. కేవలం హైదరాబాద్‌కే పరిమితం అయ్యారని, సమస్యలపై దృష్టి సారించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జ్‌గా వచ్చిన మీనాక్షినట రా జన్ మాత్రం అందుకు భిన్నంగా ముందుకెళ్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఐడియాలజీ రాష్ట్రంలో అమలవుతోందని, తద్వారా పార్టీ, ప్రభుత్వ పదవుల్లోనూ కష్టపడేవారికి న్యాయంతోపాటు సామాజిక న్యా యం అమలవుతుందనే వాదన వినిపిస్తోంది. కాగా, బీసీ కులగణన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు నివాసంలో ఏర్పాటు చేసిన మున్నూరుకాపు సంఘం నాయకుల సమావేశంపై మీనాక్షినటరాజన్ ఆరా తీసినట్లు సమాచారం.
ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్‌ఎస్, ఇతర పార్టీల నాయకులు హాజరుకావడంపై ఏఐసీసీ కొందరు ఫిర్యాదు చేయగా, మీనాక్షి స్పందించారు. ఈ విషయంపై పార్టీ సీనియర్ నేత వీహెచ్ స్పందిస్తూ.. ప్రభుత్వం చేపట్టిన కులగణనకు మద్దతుగానే మున్నూరు కాపు సమావేశం జరిగిందని,
ఈ సమావేశంలో ఎవరూ ఎలాంటి విమర్శలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ తీసుకుని.. మున్నూరు కుల సంఘం ఆధ్వర్యంలో భారీ సభకు ప్లాన్ చేయాలనే ఆలోచనతో ఉన్నామని చెప్పారు.