07-03-2025 05:25:21 PM
శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ నిర్వాసితుల డిమాండ్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): టీబీజీకేఎస్ మందమరి ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బెల్లంపల్లి శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ నిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాంతిఖని దాని వద్ద గురువారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో లాంగ్ వాల్ ప్రాజెక్టును నిర్వాసిత రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తే మేడిపల్లి సంపత్ అందుకు మద్దతు తెలపడం రైతుల జీవితాలతో చెలగాటమాడటమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణి అధికారులతో తొత్తుగా మారి రైతులను నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయాయని, వ్యవసాయ బోర్లలో చుక్కనీరు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణికి తొత్తులుగా మారి శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణకు మద్దతు విరమించుకోకపోతే మందమర్రి లోని మేడిపల్లి సంపత్ ఇంటిపై మూకుమ్మడిగా దాడులు చేస్తామని హెచ్చరించారు. బెల్లంపల్లి మండలంలోని నిర్వాసిత గ్రామాలలో వందల ఎకరాల భూములు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గంటలకొద్దీ ఎండలో నిలబడి రైతులమంతా శాంతి ఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణకు వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తే తమ ప్రాంతంతో సంబంధం లేదు మేడిపల్లి సంపత్ ఎలా మద్దతు ప్రకటిస్తారని ప్రశ్నించారు.
మేడిపల్లి సంపత్ శాంతిఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్టుకు మద్దతు తెలిపి టీబీజీకేఎస్ వైఖరిని ప్రదర్శించారా అని ప్రశ్నించారు. బి ఆర్ ఎస్ నాయకులు మేడిపల్లి సంపత్ మీద నిరసన తెలపాలని లేకపోతే బీ ఆర్ ఎస్ నాయకులు కూడా లాంగ్ వాల్ ప్రాజెక్టుకు మద్దతుగా నిలుస్తున్నట్లు భావించాల్సి వస్తుందని అన్నారు. కార్మిక సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు నిర్వాసిత రైతుల పక్షాన నిలువకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. సింగరేణి ఇచ్చే చిల్లర డబ్బులు తీసుకొని రైతులకు తీరని ద్రోహం చేయాలని చూస్తే సహించబోమన్నారు. నష్టపోయే బెల్లంపల్లి ప్రాంతం కోసం మాట్లాడే హక్కు మందమర్రి ప్రాంత కార్మిక సంఘాల నాయకులకు ఎంత మాత్రం లేదన్నారు. శాంతిఖని గని లాంగ్వాల్ ప్రాజెక్టు విస్తరణకు అనుమతులు వస్తే అనుకూలంగా వ్యవహరించిన నాయకుల ఇండ్ల మీద దాడులు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.
టీబీజీకేస్ నాయకుల బట్టలు విప్పి ప్రజాక్షేత్రంలో నిలబెడతామని పేర్కొన్నారు. లాంగ్ వాల్ ప్రాజెక్ట్ విస్తరణకు పర్యావరణ అనుమతులు రాకుండా ప్రతి ఒక్కరు రైతులకు మద్దతు తెలపాలని కోరారు. గ్రామాలు కన్నతల్లి లాంటివని వాటిని కాపాడుకోవాలని కోరారు. టీబీజీకే ఎస్ నాయకత్వం మేడిపల్లి సంపత్ తో క్షమాపణ చెప్పించాలన్నారు. లేనట్లయితే శాంతి ఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణ విషయంలో లగచర్ల రైతుల పోరాటాన్ని ఇక్కడ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నిర్వాసిత రైతులు సింగతి సత్యనారాయణ, చింతం స్వామి, బత్తుల రవి, గోమాస భీమయ్య, దూడెం మహేష్, పెట్టెం రాయలింగు, రాచకొండ మహేశ్వరరావు, బానోతు మోతిలాల్, జంగపల్లి స్వామి, పాయవేని సత్యనారాయణ, మెండి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.