calender_icon.png 26 October, 2024 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిగడ్డ జాతీయ విపత్తే!

26-10-2024 02:26:40 AM

* పాజెక్టును అత్యంత వేగంగా పూర్తిచేయాలన్న ఆలోచనతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిబంధనలన్నీ పక్కనబెట్టి నేరుగా ప్రాజెక్టు ఇంజినీర్లకు ఆదేశాలిస్తూ పనులు చేయించారు. కానీ, ఇందులో వాస్తవం ఏమిటంటే.. ఈ ప్రాజెక్టును ఇరిగేషన్ ఇంజి నీర్లు కాకుండా కాంట్రాక్టర్లే అంతా తామే అయ్యి ఇష్టారాజ్యంగా నిర్వహించారు. 

* మేడిగడ్డ టెండర్లలో స్పష్టంగా కనిపించే వాస్తవం ఏమిటంటే ప్రభుత్వం ముందుగా ఎంపిక చేసుకొన్న కంపెనీకే కాంట్రాక్టు కట్టబెటింది. ప్రభుత్వం ఇంత బహిరంగంగా.. ఒక రకంగా పాలకులే వైట్ కాలర్ నేరం చేసినా ఏ ఒక్క బిడ్డర్ ఇదేమిటని ప్రశ్నిస్తూ కోర్టుకు వెళ్లలేక పోయారు. 

* ఇసుక పునాదులపై అంతపెద్ద బరాజ్‌ను ఎలా నిర్మించారని ప్రజలు అనుమానంలో అయోమయంలో ఉన్నారు. కానీ, ఇలాంటి బరాజ్‌లు ఇసుక పునాదులపై నిర్మించవచ్చు. అందుకు దేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. దశాబ్దాల క్రితం ఇసుక పునాదులపై నిర్మించిన బరాజ్‌లు కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.

* ఏదైనా ప్రాజెక్టును పూర్తిచేసిన తర్వాత గుత్తేదారుకు ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీచేస్తుంది. అది జారీచేసే ముందే ఇంజినీర్లు ప్రాజెక్టును క్షుణ్ణంగా పరీక్షించి పెండింగ్ పనులు ఏమీ లేవని నిర్ధారించాల్సి ఉంటుంది. ఎన్‌వోసీ ఇచ్చిన తర్వాత సదరు కాంట్రాక్టర్ ముందుగా ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీని తిరిగి తీసేసుకొంటారు. మేడిగడ్డ బరాజ్ విషయంలో ఈ నియ మాలేవీ పట్టించుకోలేదు. బరాజ్ పనులు పూర్తిగా చేయకముందే గుత్తేదారు తన బ్యాంకు గ్యారెంటీని తీసేసుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

* మేడిగడ్డ బరాజ్ డిజైన్‌లోనే లోపమున్నది. ఇప్పుడు ఈ ప్రమాదంపై నాడు ప్రాజెక్టును పర్యవేక్షించిన ఇంజినీర్లు (సీడీవో) రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్ల ఒత్తిడి వల్లే లోపాల డిజైన్‌పై ప్రాజెక్టు నిర్మించాల్సి వచ్చిందని చెప్పి తప్పించుకోలేరు. ఎందుకంటే వారు చేసిన తప్పిదమే ఇప్పుడు జాతీయ విపత్తుగా మారింది.

* బరాజ్‌ల నిర్మాణానికి టెండర్లు పిలిచినప్పుడే ప్రభుత్వం తప్పులు చేసింది. టెండర్ల అర్హత నిబంధనల్లో టెండర్లు వేసే కంపెనీకి బరాజ్‌లు నిర్మించిన అనుభవం ఉండాలని షరతు పెట్టకుండా పైప్‌లైన్లు నిర్మించిన అనుభవం మాత్రమే ఉన్న సంస్థలకూ అర్హత కల్పించారు. 

* రూ.1800 కోట్లతో చేపట్టిన మేడిగడ్డ బరాజ్ నిర్మాణ వ్యయాన్ని రెండేండ్లలో ఏకంగా రూ.4000 కోట్లకు పెంచారు. ఏ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా ఏటా 5 నుంచి 10 శాతానికి మించి నిర్మాణ వ్యయాన్ని పెంచరు. కానీ, మేడిగడ్డ బరాజ్ విషయంలో ప్రభుత్వం రెండేండ్లలో ఏకంగా 100 శాతానికి పైగా నిర్మాణ వ్యయాన్ని పెంచింది. దీనికి బాధ్యులు ఎవరు? 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజల నోళ్లలో అత్యధికంగా నానిన పేరు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. దాదాపు లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం ఒక పర్యాటక ప్రాంతంగా మారేంతగా ప్రచారం చేసింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి దశనూ ఒక ప్రపంచ వింతగా ప్రచారం చేసింది. మూడేండ్ల అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించామని ఊదరగొట్టింది. ప్రాజెక్టు పూర్తయ్యి నీళ్లు ఎత్తిపోయటం మొదలైన తర్వాతగానీ దాని పతార ఎంతో ప్రజలకు అర్థం కాలేదు.

ప్రజలకు తాగు, సాగు నీరు అందించే ఏ నిర్మాణమైనా అత్యంత ముఖ్యమైనదే. అందునా తెలంగాణ వంటి ప్రాంతానికి నీటిపారుదల ప్రాజెక్టులు మరింత కీలకం. గత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ కాళేశ్వరం ద్వారా కరువు ప్రాంతమైన మెదక్ జిల్లాకు నీళ్లు తీసుకొచ్చారు.

భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు హైదరాబాద్ మహానగరానికి కూడా తాగు నీరు అందించాల్సి ఉన్నది. అయితే, ఎక్కడైనా ఒక చిన్న చెరువు కట్ట కడితేనే ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటారు. కానీ, లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంలో ఎక్కడా నిబంధనలు పాటించినట్టు కనిపించటంలేదు. టెండర్ల దశ నుంచే ఈ ప్రాజెక్టు గాడి తప్పింది.

పాలకులకు, వారి అనుయాయులైన కొద్దిమంది కాంట్రాక్టర్లకు కామధేనువు అయ్యింది. ప్రజల నెత్తిన లక్ష కోట్ల అప్పుల కుంపటి అయ్యి కూర్చున్నది. అందుకు ఉదాహరణ కాళేశ్వరంలోని అతి ప్రధానమైన మేడిగడ్డ బరాజ్ కుంగిపోవటమే. ఈ ప్రమాదం నదికి అడ్డంగా నిర్మించిన ఒక నిర్మాణం కూలిపోవటం మాత్రమే కాదు.. ఇది ఒక జాతీయ విపత్తు.

* ఈ ప్రాజెక్టు వ్యయ అంచనాలే అసంబద్ధంగా ఉన్నాయి. మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల సీఎస్‌ఆర్ రేట్లతో పోల్చితే ఈ కాళేశ్వరం అంచనాలు ఏకంగా 30 శాతం అధికంగా నిర్ణయించారు.

* ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తిచేయాలన్న ఆలోచనతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిబంధనలన్నీ పక్కనబెట్టి నేరుగా ప్రాజెక్టు ఇంజినీర్లకు ఆదేశాలిస్తూ పనులు చేయించారు. కానీ, ఇందులో వాస్తవం ఏమిటంటే.. ఈ ప్రాజెక్టును ఇరిగేషన్ ఇంజినీర్లు కాకుండా కాంట్రాక్టర్లే అంతా తామే అయ్యి ఇష్టారాజ్యంగా నిర్వహించారు. 

* గుత్తేదార్ల ఇష్టారాజ్యంపై సీఎం కేసీఆర్‌కు మాట మాత్రమైనా చెప్పే ధైర్యం ఏ ప్రభుత్వ ఇంజినీరూ చేయలేకపోయారు. దాని ఫలితంగా వ్యవస్థ మొత్తం కుప్ప కూలింది. ప్రాజెక్టు వ్యతిరేక ఫలితాలను ఇచ్చింది. వేల కోట్ల ప్రజా ధనం నీటిపాలైంది. 

* బరాజ్‌ల నిర్మాణానికి టెండర్లు పిలిచినప్పుడే ప్రభుత్వం తప్పులు చేసింది. టెండర్ల అర్హత నిబంధనల్లో టెండర్లు వేసే కంపెనీకి బరాజ్‌లు నిర్మించిన అనుభవం ఉండాలని షరతు పెట్టకుండా పైప్‌లైన్లు నిర్మించిన అనుభవం మాత్రమే ఉన్న సంస్థలకూ అర్హత కల్పించారు. 

* కాళేశ్వరంలో మేడిగడ్డ అత్యంత కీలకమైన బరాజ్. దీని నిర్మాణానికి గతంలో బరాజ్‌లు నిర్మించిన అనుభవం ఉన్న గుత్తేదారునే ఎంపిక చేయాల్సి ఉండె.. కానీ అలా జరుగలేదు. పైప్‌లైన్లు నిర్మించిన అనుభవం ఉన్న కంపెనీలను ప్రభుత్వం ‘ప్రత్యేకంగా’ ఎంపిక చేసింది. సదరు కంపెనీ అర్హతలు కూడా నకిలీవే.

* అంచనాకు అటు ఇటుగా రూ.1800 కోట్లతో ఎల్ 1 ప్యాకేజీ కాంట్రాక్టును ఎంపిక చేసిన అతికొద్ది మంది బిడ్డర్లకే కట్టబెట్టారు. దీనివల్ల అసలు మార్కెట్ విలువ ఎంతనో ఎవరికీ తెలియకుండా పోయింది. 

* మేడిగడ్డ టెండర్లలో స్పష్టంగా కనిపించే వాస్తవం ఏమిటంటే ప్రభుత్వం ముందుగా ఎంపిక చేసుకొన్న కంపెనీకే కాంట్రాక్టు కట్టబెటింది. ప్రభుత్వం ఇంత బహిరంగంగా.. ఒక రకంగా పాలకులే వైట్ కాలర్ నేరం చేసినా ఏ ఒక్క బిడ్డర్ ఇదేమిటని ప్రశ్నిస్తూ కోర్టుకు వెళ్లలేక పోయారు. 

* వాస్తవంగా బరాజ్ నిర్మాణానికి పట్టే సమయం నాలుగేండ్లు కాగా, టెండర్ నోటిఫికేషన్‌లోనే 18 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం కండిషన్ పెట్టింది. 

* ఇసుక పునాదులపై అంతపెద్ద బరాజ్‌ను ఎలా నిర్మించారని ప్రజలు అనుమానంలో అయోమయంలో ఉన్నారు. కానీ, ఇలాంటి బరాజ్‌లు ఇసుక పునాదులపై నిర్మించవచ్చు. అందుకు దేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. దశాబ్దాల క్రితం ఇసుక పునాదులపై నిర్మించిన బరాజ్‌లు కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. 

* ఇసుక పునాదులపై ఇలాంటి ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు దాని జీవితకాలం మొత్తంలో ఆ ఇసుక కొట్టుకుపోకుండా కాపాడేలా డిజైన్లు ఉండాలి. నిర్మాణం కుంగిపోయే అవకాశం లేకుండా నిర్మించాలి. మేడిగడ్డలో ప్రమాద తీవ్రత పెరగటానికి కారణం అది బరాజ్ కం రిజర్వాయర్ కూడా కావటమే. 

* మేడిగడ్డలో కొంతభాగం వరకు పిల్లర్లు, గేట్లు, బరాజ్ కూడా కుంగిపోవటానికి కారణం పునాదుల్లోని ఇసుక కొట్టుకుపోవటమే అనేది సుస్పష్టం. పునాదిని సరైన రీతిలో గట్టిపర్చకుండానే నిర్మాణం చేపట్టడమే ఈ విపత్తుకు కారణం. 

* మేడిగడ్డ కుంగుబాటుపై రాజకీయ నాయకుల ప్రకటనలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఇతర ప్రాజెక్టుల్లోనూ జరిగాయని అత్యంత తేలిగ్గా కొట్టిపారేయటం ప్రమాదకరం. వారి తీవ్ర నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. మేడిగడ్డ ప్రమాదం వ్యవస్థ వైఫల్యమే కానీ ఇంకేమీ కాదు. ఈ ప్రమాదం వల్ల వందలకోట్ల ప్రజా ధనం వృధా కావటం మాత్రమే జరుగలేదు. ప్రజలకు సాగు నీరు అందించాలన్న అత్యంత ముఖ్యమైన లక్ష్యం కూడా చెదిరిపోయింది. మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుతో జరిగిన నష్టం దాదాపు రూ.40,000 కోట్లు. 

మేడిగడ్డ బరాజ్ డిజైన్‌లోనే లోపమున్నది. ఇప్పుడు ఈ ప్రమాదంపై నాడు ప్రాజెక్టును పర్యవేక్షించిన ఇంజినీర్లు (సీడీవో) రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్ల ఒత్తిడి వల్లే లోపాల డిజైన్‌పై ప్రాజెక్టు నిర్మించాల్సి వచ్చిందని చెప్పి తప్పించుకోలేరు. ఎందుకంటే వారు చేసిన తప్పిదమే ఇప్పుడు జాతీయ విపత్తుగా మారింది. 

* బరాజ్‌లోకి వచ్చే వరద, కిందికి వెళ్లే వరద ప్రవాహాలతోపాటు బరాజ్‌ను వరద దాటే ప్రదేశంలోనూ కాంక్రీట్ డయాఫ్రమ్, కట్ ఆఫ్ వాల్స్ ప్రతిపాదించాల్సి ఉండె. సైయంట్ పైల్స్ వేయటం పెద్ద పొరపాటు. ఈ సైయంట్ పైల్స్ కూడా సరైన విధానంలో, తగిన నాణ్యతతో నిర్మించలేదు.

టెండర్ దక్కించుకొన్న ప్రధాన కాంట్రాక్టర్.. ఈ బరాజ్ నిర్మాణ బాధ్యతలను చిన్న సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించాడు. వాళ్లు అనుభవలేమితో పనులు చేయటంతోనే పునాదుల్లో ఇసుక కొట్టుకుపోయి నిర్మాణానికి తీవ్ర నష్టం జరిగింది. బరాజ్‌లో కొన్ని కాంక్రీట్ బ్లాక్స్ కొట్టుకుపోయిన తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని మెయింటనెన్స్ చేపట్టలేదు.

దక్షిణ భారతదేశంలోనే గోదావరి అతి పెద్ద నది. అంతేకాదు అత్యధికంగా వరద వచ్చే నది కూడా. ఇంతపెద్ద నదికి అడ్డంగా ఓ కట్టడం నిర్మించాలంటే అణువణువునా ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. కానీ, మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో ఇవేవీ కనిపించవు. లోపభూయిష్టమైన డిజైన్‌కు తోడు కాంక్రీట్ నిర్మాణంలో ఎక్కడా నాణ్యతా పరీక్షలు నిర్వహించినట్టు కనిపించదు.

నాణ్యత లోపంతోపాటు నాటి సీఎం కేసీఆర్ అధికారులను, గుత్తేదారును నిలువనీయకుండా ఉరుకులు పరుగులు పెట్టించటంతో నాణ్యతను పట్టించుకోకుండా ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేయటమే లక్ష్యంగా పనిచేశారు. దాని ఫలితమే ప్రారంభించిన ఏడాదికే బరాజ్ కుంగిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయింది. 

* ఏదైనా ప్రాజెక్టును పూర్తిచేసిన తర్వాత గుత్తేదారుకు ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీచేస్తుంది. అది జారీచేసే ముందే ఇంజినీర్లు ప్రాజెక్టును క్షుణ్ణంగా పరీక్షించి పెండింగ్ పనులు ఏమీ లేవని నిర్ధారించాల్సి ఉంటుంది. ఎన్‌వోసీ ఇచ్చిన తర్వాత సదరు కాంట్రాక్టర్ ముందుగా ఇచ్చిన బ్యాంకు గ్యారెం టీని తిరిగి తీసేసుకొంటారు. మేడిగడ్డ బరాజ్ విషయంలో ఈ నియమాలేవీ పట్టించుకోలేదు. బరాజ్ పనులు పూర్తిగా చేయకముందే గుత్తేదారు తన బ్యాంకు గ్యారెంటీని తీసేసుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

* రూ.1800 కోట్లతో చేపట్టిన మేడిగడ్డ బరాజ్ నిర్మాణ వ్యయాన్ని రెండేండ్లలో ఏకంగా రూ.4000 కోట్లకు పెంచారు. ఏ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా ఏటా 5 నుంచి 10 శాతానికి మించి నిర్మాణ వ్యయాన్ని పెంచరు. కానీ, మేడిగడ్డ బరాజ్ విషయంలో ప్రభుత్వం రెండేండ్లలో ఏకంగా 100 శాతానికి పైగా నిర్మాణ వ్యయాన్ని పెంచింది. దీనికి బాధ్యులు ఎవరు? 

* నాటి సీఎం కేసీఆర్ మేడిగడ్డ బరాజ్ నిర్మాణ పనులును ప్రతిరోజూ సమీక్షించారు. ఏ రోజు ఎన్ని క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగింది అనేది కూడా ఆయన తెలుసుకొనేవారు. కానీ, మొత్తం బరాజ్ నిర్మాణం ఎలా జరుగుతున్నది అనేది మాత్రం పట్టించుకోలేదు. 

* సాక్షాత్తు ముఖ్యమంత్రే నిత్యం ఎన్ని మీటర్ల పని జరిగింది? ఎంత కాంక్రీట్ వాడారు? ఎంత మంది కూలీలను ఉపయోగించారు? అని ప్రతి చిన్న విషయాన్ని కూడా గుచ్చిగుచ్చి అడుగుతుండటంతో ఇంజినీర్లు, అధికారులు పనుల నాణ్యతను పక్కనబెట్టి పనుల పరిమాణాన్ని మాత్రమే చూడటం మొదలుపెట్టారు.

సీఎం వద్ద మెప్పు పొందేందుకు ప్రాజెక్టు గోడల మందం పెంచటం, కాంక్రీట్ నాణ్యతను చిలువలు పలువులను చేసి చెప్పటం మొదలుపెట్టారు. దీంతో పనులు ముందుగా నిర్ణయించినదానికంటే ఎక్కువగా జరుగుతున్నాయని భ్రమపడిన ప్రభుత్వం నిర్మాణ వ్యయాన్ని అధికారులు అడిగిందే తడవుగా అమాంతం పెంచు కొంటూ పోయింది. కానీ, ముందుగా నిర్ణయించిన ప్రకారం కాకుండా మరో విధానాన్ని ఎందుకు అనుసరిస్తున్నారని మాత్రం ఆలోచన చేయలేదు. 

* ఒకవైపు కాంట్రాక్టర్లు తమ ఆర్థిక, న్యాయపరమైన ప్రయోజనాలు కాపాడుకొం టుండగా ప్రభుత్వం మాత్రం పెరిగిన నిర్మాణ వ్యాయానికి గుత్తేదారు నుంచి పెనాల్టీగా వసూలు చేస్తామని ప్రకటనలు గుప్పిస్తూ వచ్చింది. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండేది. గుత్తేదార్లు నిబంధనల్లోని లొసుగులను వాడుకొని బయటపడుతుంటే.. వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వం కండ్లు మూసుకొని కాంట్రాక్టర్లు, అధికారులను కాపాడుతూ వచ్చింది. 

* మేడిగడ్డ బరాజ్ కుంగిపోవటంపై ఇంత రాద్ధాంతం చేస్తున్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం.. బరాజ్ నిర్మించిన గుత్తేదారు నుంచి నష్టపరిహారం ఎందుకు వసూలు చేయటం లేదు? జరిగిన నష్టంపై కాంట్రాక్టర్‌కు నోటీసులు ఎందుకు జారీ చేయలేదు? పనులు నిర్వహించిన ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టలేదు? ప్రాజెక్టు పనికిరాకుండా పోవటానికి కారణమైనవారిని శిక్షిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ తాత్కాలికమేనా? ఒకవేళ మేడిగడ్డ ప్రమా దంలో కాంట్రాక్టర్ తప్పు ఏమీ లేకపోతే దానిని పర్యవేక్షించిన అధికారులు, వారికి ఆదేశాలిచ్చిన రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. అయితే ఇటీవల సదరు కాంట్రాక్టర్‌కు ఇచ్చిన ఎన్‌వోసీని ప్రభుత్వం వెనక్కు తీసుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

* గోదావరి బలిపశువై ప్రభుత్వ ఖజానా నిశ్శబ్దంగా కుంగిపోతుంటే.. కుట్రదారులు, నేరస్తులు మాత్రం స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోతున్నారు. 

* మేడిగడ్డ లాంటి భారీ ప్రాజెక్టు నిర్మించాలని అనుకొన్నప్పుడు ముందుగానే నిర్మాణ స్థలం, ఎత్తు, పరిమాణం, నిల్వ సామర్థ్యం వంటి అంశాలను నిర్ణయిస్తారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తారు. కానీ, మేడిగడ్డ విషయంలో రివర్స్‌లో జరిగింది. టెండర్లు పిలిచి పనులు అప్పగించిన తర్వాత ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ బరాజ్ ఎక్కడ నిర్మించాలి? ఎంత ఎత్తులో నిర్మించాలి? అలైన్‌మెంట్స్ ఏమిటి? అనే విషయాలను హైపవర్ కమిటీని అడగటం షాకింగ్ విషయం. 

ముగింపు

కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఇంజినీర్‌గా మారి ప్రాజెక్టు నిర్మాణంలో నిత్యం జోక్యం చేసుకొన్నారు. కాంట్రాక్టర్లు తెరవెనుక నాటకాలాడుతూ తాము చేయాలనుకొన్నది చేశారు. ఇంజినీర్లు తమ నైపుణ్యాలను కనీసం ఉపయోగించలేకపోయారు. బరాజ్ కుంగటానికి లోపభూయి ష్టమైన డిజైన్ ప్రధాన కారణం. దానిని బలహీనమైన నిర్మాణం, నిర్వహణ లోపాలు తోడయ్యాయి. ఎలాంటి విచారణ చేయకుండా టెండర్లు కట్టబెట్టారు. డీపీఆర్, ప్రాజెక్టు అంచనాలు అసాధారణంగా పెంచేశారు. మొత్తంగా ఇది వ్యవస్థ సంపూర్ణ వైఫల్యం. 

  తీసుకోవాల్సిన చర్యలు

* బరాజ్ ప్రాంతంలో సవివరమైన జియోలాజికల్ సర్వే నిర్వహించాలి. నిర్మాణానికి మరమ్మతులు చేయటానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ ప్యానల్ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి. 

* ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకొన్న పాత అధికారులను వెంటనే అక్కడి నుంచి వేరేచోటికి మార్చి కొత్తవారిని అక్కడ నియమించాలి. మరమ్మతు పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలి. 

* సీడీవో చీఫ్ ఇంజినీర్‌కు ప్రాజెక్టుల డిజైనింగ్‌లో కనీసం పదేండ్ల అనుభవం ఉండాలి. అలాంటివాళ్లనే చీఫ్ ఇంజినీర్ (సీడీవో) గా నియమించాలి. 

* బరాజ్ కుంగుబాటుకు కారణమైన అధికారులందరినీ శిక్షించాలి. 

* బరాజ్ నిర్మాణంలో కాంట్రాక్టర్ సంపాదించిన 30 శాతం లాభాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి. 

* డ్యామ్ సేఫ్టీ నివేదికను అనుసరించి బరాజ్‌కు ఈ ఏడాది డిసెంబర్ నుంచైనా మరమ్మతులు మొదలుపెట్టాలి. కుంగిన మూడు బ్లాక్‌లను పూర్తిగా తొలగించాలి. కొత్త డయాఫ్రం, కటాఫ్ వాల్స్ నిర్మించాలి. ఆప్రాన్‌ను పొడిగించాలి. 

* దేశంలో భవిష్యత్తులో నిర్మించే నీటి పారుదల ప్రాజెక్టులకు అక్కరకు వచ్చే విధంగా మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో ఎదురైన సమస్యలు, పరిష్కారాలపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. 

* బరాజ్ నిర్మాణ వ్యయం రూ.1800 కోట్ల నుంచి రూ.4000 కోట్లకు ఎందుకు పెరిగింది అనేదానిపై లోతైన దర్యాప్తు జరపాలి. 

* మేడిగడ్డ బరాజ్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వరం సంస్థ వ్యాప్కోస్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లు చెల్లించింది. కానీ, సరైన జియోలాజికల్, హైడ్రాలాజికల్ విచారణ చేయకుండానే ఆ సంస్థ డీపీఆర్‌ను ఎందుకు సిద్ధం చేసిందనే అంశంపై విచారణ జరిపించాలి. వ్యాప్కోస్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టడంతోపాటు ఆ సంస్థపై క్రిమినల్ కేసు పెట్టే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి.  

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి