- మెడికల్ షాపుల మాయాజాలం
- లైసెన్స్ ఒకరిది.. నిర్వహణ మరొకరిది
- కొరవడిన అధికారుల పర్యవేక్షణ
వికారాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): మీకు జ్వరం వస్తోందా.. తలనొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఏం భయం లేదు. అనారోగ్య సమస్యలపై డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. సమస్య చెబితే చాలు అన్ని రకాల మందులు మెడికల్ షాపుల్లో ఎంత మొత్తం లో కావాలన్నా ఇస్తారు. ప్రిస్క్రిప్షన్ అవసరమే లేదు. ఏ మందులు ఎన్ని రోజులు వాడాలో మెడికల్ షాపుల నిర్వాహకులే చెబుతారు.
ఈ విధంగా మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నారు. ఎలాం టి అనుమతులు లేని కొన్ని మందులు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. షాపులపై ఔషధ నియంత్రణ అధికారుల నిఘా సక్రమంగా లేకపోవడంతోనే ఇలాంటి అమ్మకా లు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
లాభం ఎక్కువగా ఉన్న మందులే..
ప్రజల ఆరోగ్యం పక్కన పెట్టి కేవలం ధనార్జనే ధ్యేయంగా మెడికల్ దందాను నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. షాపుల నిర్వాహకులు అత్యధికంగా లాభం వచ్చే మందులను రోగులకు అంటగడుతున్నారు. వైద్యులు యాం టీబయాటిక్స్ సూచించినప్పుడు ఎందుకోసం రాశారో సదరు ప్రిస్క్రిప్షన్‌లో ఉండాల్సిందేనని గతంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం మెడికల్ షాపుల నిర్వాహకులు మందులు ఇవ్వాలి. కానీ ఈ నిబంధనలను ఎక్కడా పట్టించుకోవడం లేదు. షాపులో ఏది అందుబాటులో ఉంటే అది, దేనిపై ఎక్కువ లాభం ఉంటే ఆ మందులనే అంటగడుతున్నారు.
వైద్యులు సూచించకున్నా..
వైద్యుల సిఫారసు ఉంటేనే మెడికల్ షాపుల్లో మందులు అమ్మాల్సి ఉంటుంది. కానీ, ఎక్కడా నిబంధనలు అమలు కావడం లేదు. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా వ్యాధికి సంబంధించిన పేరు చెప్పగానే ఏదో ఒక మందును అంటగడుతున్నారు. జలుబు, దగ్గు, తలనొప్పికి కూడా మందులు వారే ఇవ్వడంతో పాటు యాంటీబయాటిక్స్ సైతం అమ్ముతున్నారు.
వైద్యులు సుమారు 15 రోజుల వరకే మందులు రాస్తారు. అనంతరం మళ్లీ చూపించుకోవాల్సి ఉంటుంది. ప్రజలు అలా చేయకుండా మెడికల్ షాపులోకి వెళ్లి పాత మందులే తెచ్చుకుంటు న్నారు. కొంతమంది మూడు నుంచి నాలుగేళ్ల పాటు మెడికల్ షాపులో పనిచేసిన కాస్తంత అనుభవంతో ఏకంగా సొంతంగా మెడికల్ షాపులే పెట్టేస్తున్నారు.
సర్టిఫికెట్ ఒకరిది..నడిపేది మరొకరు
నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు గల్లీగల్లీకి పుట్టుకొస్తున్నాయి. మెడికల్ షాపులో డీ ఫార్మసీ పూర్తి చేసిన వారే ఉంటూ మందులు ఇవ్వాలి. కానీ అద్దెకు సర్టిఫికెట్లు తెచ్చుకొని లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేస్తున్నవారే ఎక్కువ శాతం ఉ న్నారు. సంబంధిత అధికారుల ఆశీస్సులతో దందా ఫుల్‌గా నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు చిన్న క్లినిక్ నుంచి నర్సింగ్ హోంల వరకు ఎవరికి వారే మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకొని కాస్త అనుభవం ఉన్న వారితో మందులు అమ్మేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీల ఇళ్లలో మెడికల్ షాపులను తలపించేలా మందులు ఉంటున్నాయి. నిజానికి ఆర్‌ఎంపీల వద్ద మందులు ఉండకూడదు. వారి వద్దకు వచ్చిన వారికి ప్రథమ చికిత్స మాత్ర మే చేయాల్సి ఉంటుంది. కానీ, ఇష్టానుసారంగా మందులు, ఇంజక్షన్లు ఇస్తున్నారు.
పట్టింపులేక..
వికారాబాద్ జిల్లాలో మెడికల్ షాపులపై పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు ఉన్నా యి. జిల్లాలో సుమారు 382 మెడికల్ షాపులు, 150 వరకు ఏజెన్సీలు ఉన్నాయి. జిల్లా కేంద్రం ఏర్పడినప్పటికీ ఇక్కడ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం లేకపోవడం గమనార్హం. జిల్లా డ్రగ్ అధికారి ఉన్నా ఆయన ఎప్పుడు వస్తారో, ఎప్పుడు తనిఖీ చేస్తారో ఎవరికీ తెలియదు.
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు
జిల్లాలో నడుస్తున్న అన్ని మెడికల్ షాపులకు లైసెన్స్‌లు ఉన్నాయి. లైసెన్స్ ఒకరి పేరుమీద ఉండి మరొకరు నడపడం అనేది మా దృష్టికి రాలేదు. ఒకవేళ అలా ఉంటే వారి లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉంటుంది. నాసిరకం మందులు అమ్మితే చర్యలు తప్పవు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మందులు అమ్మాలి.
క్రాంతికుమార్,
డ్రగ్ ఇన్‌స్పెక్టర్, వికారాబాద్