* మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ కామకోటి వ్యాఖ్యలపై దుమారం
* సూడోసైన్స్‌ను ప్రమోట్ చేస్తున్నారని పలువురి ఆగ్రహం
చెన్నై, జనవరి 20: గోమూత్రంలో ఔషధ గుణాలు ఉన్నాయంటూ మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ వి.కామకోటి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. చెన్నైలో ఈ నెల 15 మాటు పొంగల్ సందర్భంగా గోవు జాతుల వృద్ధి, ప్రకృతి వ్యవసాయంపై ఓ సంస్థ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘గోమూత్రం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఔషధంగా పనిచేస్తుంది.
జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కొన్నిరకాల జీర్ణకోశ సంబంధిత వ్యాధ్యులను గోమూత్రం నయం చేస్తుంది. గోవు ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసి అద్భుతాలు సృష్టించవచ్చు. తద్వారా ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయవచ్చు’ అని కామకోటి ఆ వీడియోలో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై ద్రవిడ కజగం సంస్థ స్పందిస్తూ.. ‘బాధ్యత గల వృత్తిలో ఉన్న కామకోటి అశాస్త్రీయమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు’ అని విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీ నేత కార్తీ చిదంబరం స్పందిస్తూ.. ‘కామకోటి అనాలోచితంగా వ్యాఖ్యలు చేశారు. సూడో సైన్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు’ అని మండిపడ్డారు.