19-04-2025 06:44:35 PM
మంచిర్యాల (విజయక్రాంతి): హజ్ యాత్రకు వెళ్ళబోయే ముస్లింలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్ లో హజ్ యాత్రకు వెళ్ళబోవు నలభై మంది యాత్రికులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు సమక్షంలో వైద్య పరీక్షలు జరిపారు. ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు పరీక్షలు జరిపి వ్యాక్సినేషన్ చేశారు. బీపీ, షుగర్ తదితర పరీక్షలు చేసి మందులు ఇచ్చారు.
వైద్యుల సూచనలు పాటించాలి
యాత్రకు వెళ్లేవారు వైద్యుల సూచనలు తప్పక పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు కోరారు. వైద్య సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మంచినీటిని మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలని, వెళ్లేటప్పుడు ఉపయోగించే మందులను వెంట తీసుకొని వెళ్లాలని, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అన్ని పరీక్షలు చేసిన అనంతరం యాత్రకు వెళ్లడానికి అప్రూవల్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముస్తాఫా, డాక్టర్ స్నేహిత, డాక్టర్ అశోక్, డాక్టర్ రాము, డాక్టర్ అభినవ్, డేమో వెంకటేశ్వర్లు, జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ అఖిల్ పాషా, సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, కమిటీ పెద్దలు ముజాహిద్, ఇతర ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.