సమస్యలు పరిష్కరించాలని వైద్య విద్యార్థుల ఆందోళన
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థులు
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎంత కష్టపడి చదివి ఎంబీబీఎస్(MBBS) సీటు సాధించి చదువుకుందామని వస్తే కళాశాల, హాస్టల్లో సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నామని వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. యజమాన్యం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లిన ప్రయోజనం లేకపోవడంతో గురువారం వైద్య విద్యార్థులు(Medical Students) కళాశాల ఎదుట నిరసనకు దిగడం చర్చనియాంశంగా మారింది. కళాశాలలో సరియైన బోధన సిబ్బంది లేకపోవడంతో విద్యాపరంగా తీవ్రంగా నష్టపోతున్నామని విద్యార్థులు తెలిపారు. వసతి గృహంలో తీవ్రమైన సమస్యలు నెలకొన్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. వైద్య కళాశాలలో నెలకొన్న సమస్యలను పలువురు విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కళాశాల నుండి వైద్యశాల వరకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులకు బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడ ప్రణయ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ పలు సంఘాల నాయకులు మద్దతు పలికారు.