26-03-2025 01:42:59 AM
రూ. లక్షా 33 వేల ఆర్థిక సాయం
జనగామ, మార్చి 25(విజయక్రాంతి): గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందిన ఓ ఆశా కార్యకర్త కుటుంబానికి వైద్య సిబ్బంది అండగా నిలిచారు. అందరూ ఏకమై తలా కొంత డబ్బు పోగు చేసి మొత్తంగా రూ.లక్షా 33 వేలు మృతురాలి కుటుంబానికి అందజేశారు. రఘునాథపల్లి పీహెచ్‌సీ పరిధిలోని నిడిగొండ హెల్త్ సబ్ సెంటర్‌లో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న మహేశ్వరి ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. నిరుపేద కుటుంబం కావడంతో ఆమెను ఆదుకునేందుకు వైద్య సిబ్బంది ముందుకొచ్చారు.
డీఎంహెచ్‌వో మల్లికార్జున్ పిలుపుతో రఘునాథపల్లి పీహెచ్‌సీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు రూ.61 వేలు, జిల్లాలో ఇతర పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న సిబ్బంది, వైద్యులు, ఆశా కార్యకర్తలు రూ.47,200, డీఎంహెచ్‌వో కార్యాలయం తరఫున 25 వేలు పోగు చేశారు. మొత్తం రూ.లక్షా 33 వేల 200 జమ కాగా.. ఆ మొత్తాన్ని మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా, అడిషనల్ కలెక్టర్లు పింకేశ్‌కుమార్, రోహిత్‌సింగ్, డీఎంహెచ్‌వో మల్లికార్జున్ చేతులమీదుగా మహేశ్వరి భర్త యాదగిరికి అందజేశారు. మృతురాలి కూతురుకు ఔట్ సోర్సింగ్‌ఉద్యోగం, లేదా ఆశా కార్యకర్తగా నియమించుటకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.