29-04-2025 04:55:31 PM
జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్...
మహబూబాబాద్ (విజయక్రాంతి): వైద్య సిబ్బంది, వైద్యాధికారులు సమయపాలన పాటించాలని, వేసవి దృష్ట్యా ప్రజలకు వడదెబ్బకు గురికాకుండా అవగాహన కల్పించాలని మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ భూక్య రవి రాథోడ్ సూచించారు. మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పరికరాలను, మందుల నిల్వ గదిని పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్, ఇన్ పేషంట్, అవుట్ పేషంట్ వివరాల నమోదు రిజిస్టర్ లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ... మందుల కొరత లేకుండా చూసుకోవాలని, ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే ప్రథమ చికిత్స నిర్వహించి జిల్లా ఆసుపత్రికి రిఫరల్ చేయాలని సూచించారు. సమయపాలన ప్రకారం విధులు నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వైద్యాధికారి వెంట డాక్టర్లు గుగులోతు రవి, స్వామి, నర్సింగ్ సూపర్డెంట్ విజయలక్ష్మి, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, మమత, చైతన్య, జ్యోతి ఉన్నారు.