సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్
యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): బీబీనగర్ లోని ఎయిమ్స్ హాస్పిటల్(AIIMS Hospital)లో సరిపడు వైద్య సిబ్బందిని నియమించి అన్ని రకాల వైద్యం అందించుటకు చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్(CPM District Secretary MD Jahangir) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రోజున స్థానిక సిపిఎం కార్యాలయంలో సీనియర్ నాయకులు ఎరుకలి బిక్షపతి అధ్యక్షతన జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై జహంగీర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఏకైక సంస్థగా బీబీనగర్ లో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ పనులు నత్త నడకన నడవడంవల్ల, నిర్మాణమై ఉన్న భవనాల్లో వైద్య సేవలు ప్రారంభించినప్పటికీ పూర్తిస్థాయి వైద్యం అందకపోవడం వల్ల ప్రజలు ఇప్పటికీ ప్రైవేటు హాస్పిటల్స్ కి వెళ్ళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల స్పెషలైజేషన్ డాక్టర్స్ ను, సిబ్బందిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ విధానంలో హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, వార్డ్ బాయ్స్ తదితర విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేసే విషయంలో సదరు కాంట్రాక్టర్ లక్షల రూపాయలను తీసుకొని నియమిస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చిందని అన్నారు.
ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ లైసెన్స్ ను రద్దు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓపి విభాగంలో మాత్రమే సేవలందిస్తూ ప్రాథమిక చికిత్స వరకు మాత్రమే సేవలందిస్తున్నారని, దీర్ఘకాలిక రోగాలకు, యాక్సిడెంట్ లాంటి ఎమర్జెన్సీ సేవలను అందించట్లేదని, చివరికి ప్రసూతి సేవలు కూడా డాక్టర్స్ లేరనే నెపంతో డెలివరీలు చేయట్లేదని అన్నారు. ఇంతటి దయనీయ స్థితిలో ఎయిమ్స్ ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ కు సుమారు పది జిల్లాల ప్రజలు వైద్య సేవల కోసం వస్తున్నారని వారికి సరైన వైద్యం అందకపోవడం వల్ల తిరిగి ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్ళి లక్షల రూపాయలు వెచ్చించవలసి వస్తుందని అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్, కార్యదర్శివర్గ సభ్యులు కందాడి దేవేందర్ రెడ్డి, సయ్యద్ ఉమర్, ఒవల్దాస్ సతీష్, పొట్ట యాదమ్మ, నాయకులు రేసు రామచంద్రారెడ్డి, బండారు శ్రవణ్, మాదారం శివకుమార్, మంద కిరణ్ కుమార్, కంచిమేకల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.