13-03-2025 12:00:00 AM
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, మార్చి 12 (విజయక్రాంతి) : నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డిప్యూటేషన్లను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రాష్ర్ట వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ శివరాంప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి జిల్లా ప్రభుత్వ దవాఖాన, వైద్య కళాశాల నిర్వహణపై ఆమె సమీక్ష నిర్వహించారు.
సిబ్బంది డిప్యూటేషన్ల రద్దుతో పాటు, ఖాళీ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు డీఎంఈకి వివరించారు. ప్రభుత్వ దవాఖానలో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. వైద్య కళాశాలలో సిబ్బందిని పెంచేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, పోస్టుల భర్తీకి సాధ్యమైనంత త్వరగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పారు.
అంతకుముందు గుర్రంపోడు, కనగల్ మండలాల పరిధిలో ని డీ-25 కెనాల్‌ను కలెక్టర్ పరిశీలించారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎక్కువ నీటిని విడుదల చేసినందున చివరి భూముల వరకు సాగునీరు అందుతుందని నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్,ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ అరుణకుమారి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, డీసీహె మాతృనాయక్, డిప్యూటీ డీఎంహెఓ వేణుగోపాల్ రెడ్డి, పలువురు వైద్యులు హాజరయ్యారు.