calender_icon.png 28 December, 2024 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భిణి మృతిపై వైద్యాధికారిణి సీరియస్!

28-12-2024 02:21:12 AM

కారణమైన ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): కాళ్లు, చేతులు తిమ్మిర్లతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించిన మూడు నెలల గర్భిణి బుధవారం చనిపోగా.. అందుకు కారణమైన ఆసుపత్రులపై జిల్లా వైద్యాధికారిణి స్వరాజ్యలక్ష్మి సీరియస్ అయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర, గాయితీ ప్రైవేట్ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తెలకపల్లి మండలం ఆలేరుకు చెందిన రాములమ్మ(35) జిల్లాకేంద్రంలోని శివ నర్సింగ్ హోమ్‌కు వెళ్లింది.  ఆమె పరిస్థితి విషమించినా వైద్యం అందించకుండా  అక్కడి వైద్యులు డబ్బులకు కక్కుర్తి పడి మరో ప్రైవేట్‌కు ఆసుపత్రికి రేఫర్ చేశారు. అక్కడ కూడా వైద్యురాలు అందుబాటులో లేక మరో ఆసుపత్రికి వెళ్తే అక్కడ సైతం ఆలస్యం జరిగి రోగికి వెంటిలేటర్ అవసరం పడుతుందని మరో ఆసుపత్రికి రెఫర్ చేశారు.

తీరా అక్కడ కూడా డబ్బులు బేరం చేస్తూ ఆలస్యం చేయడంతో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునేలోపు ప్రాణం పోయిందని బాధితులు జిల్లా వైద్యాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమగ్ర దర్యాప్తు చేసే క్రమంలోనే శుక్రవారం రాఘవేంద్ర, గాయత్రి, శివ నర్సింగ్ హోమ్ ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.