calender_icon.png 15 November, 2024 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక భాషల్లో వైద్య విద్య

14-11-2024 01:12:53 AM

రిజర్వేషన్లు తగ్గించేందుకు  కాంగ్రెస్ కుట్ర చేస్తోంది

ప్రధాని నరేంద్ర మోదీ

పాట్నా, నవంబర్ 13: హిందీ సహా కొన్ని స్థానిక భాషల్లో వైద్య విద్యను అందుబాటులోకి తెస్తామని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొ న్నారు. తమ పాలనలో దేశవ్యాప్తంగా లక్ష మెడికల్ సీట్లను అందుబాటులోకి తెచ్చిన్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో మరో 75 వేల సీట్లు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. బీహార్‌లోని దర్భంగాలో బుధవారం మోదీ ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేశారు. మరో రూ.12,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించారు.

అనంతరం మోదీ మాట్లాడుతూ.. దేశంలో 1.5లక్షలకు పైగా ఉన్న ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు’ పేదప్రజలకు మెరుగైన సేవలంది స్తున్నట్టు పేర్కొన్నారు. వీటి ద్వారా ఇప్పటి వరకు దాదాపు ౪ కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందినట్టు తెలిపారు. ఆటవిక రాజ్యంగా ఉన్న బీహార్‌ను సీఎం నితీశ్ అభివృద్ధి వైపుగా నడిపిస్తున్నట్టు వివరించారు. 

కాంగ్రెస్ ప్రమాదకర కుట్రలు

ప్రతిపక్ష కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు విషయంలో ఆ పార్టీ ప్రమాదకర లక్ష్యంతో పనిచేస్తోందని ఆరోపించారు. జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో సారథ్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన ప్రధాని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రిజర్వేషన్ విధానాలను ఆ పార్టీ నిరంతరంగా వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. బలహీనవర్గాల హక్కులను నిర్వీర్యం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని దుయ్యబట్టారు. కాంగెస్ యువరాజు రాహుల్‌గాంధీ రిజర్వేషన్లను ఎత్తేయాలని చూస్తున్నట్టు ఆరోపించారు.

గతంలో రాజీవ్‌గాంధీ ప్రధానిగా రిజర్వేషన్లను రద్దు చేస్తానంటూ ప్రకటించారన్నారు. కానీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యత వల్ల తర్వాత జరిగిన ఎలక్షన్లలో ఆయన ఓడిపోయినట్లు వివరించారు. నాటి నుంచి నేటి వరకు బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ గెలవలేకపోతుందని విమర్శించారు. ప్రజల కళ్ల ల్లో దుమ్ము కొట్టడానికి కాంగ్రెస్ కొత్త నాట కం ఆడుతోందన్నారు. ప్రజలు ఐక్యంగా ఉండి ఈ కుట్రలు తిప్పికొట్టాలన్నారు.   

చొరబాటుదారులే పెద్ద తలనొప్పి

బంగ్లా చొరబాటుదారుల సమస్య జార్ఖండ్‌కు పెద్ద తలనొప్పిగా మారిందని ప్రధాని అన్నారు. దేవ్‌గఢ్ సభలో మోదీ మాట్లాడు తూ.. బంగ్లాదేశీ చొరబాటుదారులను శాశ్వ త నివాసితులుగా మార్చేందుకు చేయాల్సిన తప్పులన్నీ జేఎంఎం, కాంగ్రెస్ చేసేశాయని ఆరోపించారు. దీంతో అక్రమ వలసలు రాష్ట్రానికి పెద్ద సమస్యగా మారాయన్నారు. వీరంతా జార్ఖండ్ ప్రజల ఉద్యోగాలు, ఆహారాన్ని దోచుకుంటున్నారని పేర్కొన్నారు. సం తాల్ జనాభా కూడా సగానికిపైగా తగ్గినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.

గిరిజన కుటుంబాలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందని, జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు ప్రజల సమస్యలను ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. 

ప్రధాని పాదాలను తాకేందుకు నితీశ్ ప్రయత్నం

దర్భంగాలో ఎయిమ్స్ శంకుస్థాపన సందర్భంగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని పాదాలను నమస్కరించేందుకు ప్రయత్నించారు. అనూహ్య పరిణామంతో ఒకింత షాకైన ప్రధాని, సీఎంను నిలువరించే ప్రయత్నం చేశారు. ప్రధాని పాదాలకు బిహార్ సీఎం నమస్కరించే ప్రయత్నం చేయడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. లోక్‌సభ ఎన్నికల సమయంలో మొదటగా ఆయన ప్రధాని కాళ్లను తాకే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రెండోసారి ప్రధాని పాదాలను తాకడానికి యత్నించారు.