22-03-2025 04:37:48 PM
ఆరోగ్యశ్రీ లేకున్నా కటౌట్స్ తో ప్రచారం...
కేసు షీట్... వైద్యాధికారి ఫోటోతో నూ
చోద్యం చూస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మామూళ్ల మత్తులో తూలుతోంది. దీంతో ప్రైవేట్ వైద్య అధికారులు మెడికల్ కౌన్సిల్ నిబంధనలను తుంగలో తొక్కి అమాయక ప్రజలను దగా చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంతో సహా, అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా వైద్యశాలల ప్రచారం సాగుతోంది. కొత్తగూడెంలో రెండు ఆసుపత్రులకు మాత్రమే వైద్య ఆరోగ్యశ్రీ సేవలు ఉండగా, మరికొన్ని ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ సేవలు లేకున్నా పెద్ద పెద్ద కటౌట్లు, కేర్ షీట్ల లోను ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నట్లు ప్రచారం చేసి దండుకుంటున్నారు. కొత్తగూడెంలోని వరుణ్ ఆర్థోపెటిక్ వైద్యాధికారి ఏకంగా మెడికల్ కౌన్సిల్ నిబంధనను అతిక్రమించి ఆరోగ్యశ్రీ లేకున్నా ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు.
అంతేకాదు కటౌట్లపై వైద్యాధికారి ఫోటోను ప్రచారం చేసుకోవడం మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధం. ఇటీవల కాలం చేసిన ఆర్థోపెడిక్ డాక్టర్ విజయేందరర్రావు హాస్పటల్ ను నిర్బంధాలకు విరుద్ధంగా కాంపౌండర్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది, మృతి చెందిన వైద్యాధికారి పేరును ఉపయోగించి పేద ప్రజల ను దగా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఇంత జరుగుతున్న నిబంధనలను అమలు పరిచేందుకు పని చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అందిన కాడికి పుచ్చుకొని చూసి చూడనట్లు వదిలి వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్, వైద్య శాఖ కమిషనర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రైవేట్ వైద్యుల ఆగడాలపై దృష్టి సారించాలని, అమాయక ప్రజలను మోసగిస్తున్న వైద్యులపై కఠిన చర్య తీసుకోవాలని ప్రజలు కోరుకున్నారు.