calender_icon.png 27 October, 2024 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు

03-09-2024 12:12:11 AM

  1. ఖమ్మం వరద ప్రాంతాలకు పది మెడికల్ టీంలు
  2. విషజ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  3. వైద్యాధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. అవసరమైన వారందరికీ వైద్య పరీక్షలు చేసి, మందులు అందజేయాలని సూచించారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. వరదల తీవ్రత ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లాలో పది మెడికల్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రతి టీమ్‌లో స్పెషలిస్ట్ డాక్టర్, సిబ్బంది, టెస్టులు చేయడానికి అవసరమైన పరికరాలు, మందులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మంలో మెడికల్ క్యాంపుల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను వైద్యారోగ్యశాఖ కమిషనర్ కర్ణన్‌కు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరదల తర్వాత జ్వరాలు, డయేరియా వంటి రోగాలు ప్రబలే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫీవర్ సర్వే పకడ్బందీగా చేయాలని, బాధితుల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.