బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని అంకుశం గ్రామస్తులు విషజ్వరాలతో బాధపడుతున్నట్లు విజయ క్రాంతి వెబ్ సైట్ లో శనివారం వచ్చిన కథనానికి వైద్యాధికారులు స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో విష జ్వరాలకు సంబంధించిన కథనం వైరల్ కావడంతో ఎట్టకేలకు గ్రామంలో వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలోని మాలవాడ, బొంతల గూడెంలలో ఇంటింటికి వైద్య సిబ్బంది తిరిగి జ్వర పీడితులను గుర్తించారు. 20 మంది జ్వర పీడితులకు మలేరియా రక్త పరీక్షలను నిర్వహించారు.
50 మంది జ్వర పీడితులకు మందులు అందించారు. అంకుశం గ్రామానికి సమీపంలో ఉన్న గొండుగూడ గ్రామంలో కూడా జ్వర పీడితులను గుర్తించడం జరిగిందని తాళ్ల గురజాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి. ఇవాంజెలినా తెలిపారు. సోమవారం గోండు గూడెం గ్రామంలో కూడా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె చెప్పారు. శనివారం సాయంత్రం అంకుశం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ టి. ప్రభాకర్, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ మల్లిక, ఏఎన్ఎం దేవమణి, హెల్త్ అసిస్టెంట్ శివ గణేశ్వర్ రావ్, పంచాయతీ కార్యదర్శి హర్షద్,ఆశా కార్యకర్త సుమలత పాల్గొన్నారు.