గద్వాల (విజయక్రాంతి): విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా బిసి అభివృద్ధి అధికారి బీరం సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నాగవరం ప్రభుత్వ బిసి ఏ, బి, మరియు బాలుర కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ రాచాల రష్మిక రెడ్డి, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం నిర్వహించారు.
విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వసతి గృహ ఆవరణ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా నీరు నిలువకుండా చూసుకోవాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా అవసరమని విద్యార్థులు భోజనానికి ముందు తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవాలని అన్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులైన మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా డెంగ్యూ మొదలగు వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని వసతి గృహ సంక్షేమ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు చలి జ్వరం సంబంధించిన లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ రాచాల రష్మిక రెడ్డి, వైద్య సిబ్బంది, వసతి గృహ సంక్షేమ అధికారులు ఎస్. అంజనేయులు, ఎస్. నరేందర్ రెడ్డి వసతి గృహ సిబ్బంది వైద్య సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.