11-12-2024 03:07:59 PM
కూకట్ పల్లి,(విజయక్రాంతి): కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ కెపీహెచ్బీ ఒకటో రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధ్యక్షులు బాలరాజు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా సినీ నటుడు మోహన్ బాబు వ్యవహరించడం సరైంది కాదన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయనపై అత్యాయత్నం కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. మీడియాపై తరచుగా జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. మీడియాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.