04-04-2025 02:12:47 PM
పెద్ద ఎత్తున వీఐపీలు వస్తున్నందున ప్రెస్ గ్యాలరీ రద్దు
భద్రాచలం, (విజయక్రాంతి): యావత్ భారతదేశం లో ప్రసిద్ధిగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రం(Sita Ramachandraswamy Temple)లో జరిగే సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం కార్యక్రమాలను దేశ నలుమూలల ప్రచారం చేయడానికి మీడియా సంస్థలు పోటీ పడుతుంటాయి. ప్రతి సంవత్సరం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వారి వారి పేపర్లలోనూ చానల్స్ లోను ప్రచారం చేస్తూ స్వామివారి కల్యాణ వార్తను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయటానికి అనేకమంది విలేకరులు భద్రాచలం వస్తుంటారు. ఆ వచ్చిన వారికి వారి పేపర్ ను బట్టి స్థానిక సమాచార అధికారులు పాసులు కేటాయించటం అనవాయితీ.
కానీ ఈ ఏడాది సీతారాముల కళ్యాణం(Seeta Rama Kalyanam) చూడడానికి ముఖ్యమంత్రి మంత్రులు శాసనసభ్యులు ప్రక్క రాష్ట్రాల శాసనసభ్యులు తో పాటు పలువురు వివిఐపీలు రాష్ట్ర స్థాయి అధికారులు వస్తున్నందున వారిని మండపంలో కూర్చోబెట్టడానికి ప్రెస్ గ్యాలరీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కూడా అనౌన్స్ చేయించారు. అంతేకాకుండా సమాచార శాఖ ఇచ్చిన వీడియోలు ఫోటోలు న్యూస్ వాడుకొని పేపర్లో కవర్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.
భద్రాచలం చరిత్రలో ఏనాడు లేని విధంగా జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయం పాత్రికేయులు పై తీవ్ర ప్రభావం పడనున్నది. అనేక సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం ఈసారి జిల్లా యంత్రాంగం తీసివేయడం సరికాదని పాత్రికేయులు పేర్కొంటున్నారు. కళ్యాణం కవరేజ్ చేయటానికి వచ్చిన విలేకరులు ఎప్పటికప్పుడు వార్తలు కవర్ చేస్తూ భద్రాద్రి కి వన్నెతెచ్చేవారని అలాంటి విలేకరులను కల్యాణ వద్దకు రాకుండా చేయడం సరైన పద్ధతి కాదని ఇకనైనా జిల్లా యంత్రాంగం పునరాలోచించుకొని విలేకరులు అనుమతించాలని పలువురు పాత్రికేయులు కోరుతున్నారు. ముఖ్యంగా భద్రాచలం రామాలయంలో జరిగే ప్రతి వేడుకను దేశం నలుమూలల విస్తరింపజేసే విలేకరులను అనుమతించకపోవడం చాలా బాధాకరమని ఇప్పటికైనా అధికారులు వాస్తవ దృక్పథంతో ఆలోచించి వారిని అనుమతించాలని పలువురు రామభక్తులు కోరుతున్నారు