24 May, 2026 | 1:21 PM

ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026

24-05-2026 12:18 PM

మేడ్చల్-మల్కాజిగిరి: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (BAMMD) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “2వ మెద్చల్–మల్కాజిగిరి జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026” పోటీలు నాచారం లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించబడనున్న ఈ రాష్ట్రస్థాయి క్రీడా వేడుకకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, బ్యాడ్మింటన్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి BAMMD అధ్యక్షులు మరియు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (BAT) ఉపాధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని అన్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్ వంటి క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారులను అన్ని విధాలా అండగా వుంటుంది అని ఆయన అన్నారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్రీధర్ బాబు గారు, ప్రధాన కార్యదర్శి పుల్లెలగోపీచంద్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను కూడా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో BAMMD కృషి చేస్తోందని ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా మంచి ప్రతిభ బయటకు వస్తోందని, అలాంటి క్రీడాకారులకు తగిన అవకాశాలు కల్పించేందుకు అసోసియేషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.

ఈ ఛాంపియన్‌షిప్‌కు విశేష స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. మొత్తం 540 ఎంట్రీలు నమోదు కాగా, 453 మంది క్రీడాకారులు 28 విభాగాల్లో పోటీపడుతున్నారు. అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17 మరియు అండర్-19 విభాగాల్లో బాలురు, బాలికల కోసం మ్యాచ్‌లు నిర్వహించబడుతున్నాయి. పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి.

ఈ కార్యక్రమంలో పి. వికాస్ హర్ష – ఖజాంచి, BAMMD & టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ

* నాగరాజు – జాయింట్ సెక్రటరీ, BAMMD

* ఎస్‌కే రేష్మా – సభ్యురాలు, BAMMD

* సోహైల్ – టోర్నమెంట్ చీఫ్ రిఫరీ

క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.