calender_icon.png 23 January, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌లో మేడ్చల్ జిల్లా వాసి మృతి

23-01-2025 08:04:23 PM

మావోయిస్టు అగ్రనేత చంద్రహాస్ మృతదేహం కోసం ఎదురుచూపు

మేడ్చల్,(విజయక్రాంతి): ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని గరియాబంద్, ఓడిశా రాష్ట్రంలోని నౌపాడ్ జిల్లాల సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత, మేడ్చల్ జిల్లా యాప్రాల్ కు చెందిన చంద్రహాస్ మృతిచెందాడు. ఈ ఎన్‌కౌంటర్ లో 27 మంది వరకు మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఓడిశా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. మృతుల్లో  ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద జరిగిన దాడికేసులో కీలక నిందితుడిగా ఉన్న చలపతి కూడా ఉన్నారు.

యాప్రాల్ కు చెందిన చంద్రహాస్ పై పెద్దమొత్తంలో రివార్డు ఉంది. మృతుని కుటుంబానికి పోలీసు శాఖ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. నాలుగు రోజుల క్రితం ఎన్‌కౌంటర్ జరిగినప్పటికీ మృతదేహాలను గుర్తించడానికి సమయం పట్టింది.ఛత్తీస్‌గఢ్ పోలీసులు మృత దేహాలను బయట పెట్టగా గతంలో ఆయనతో పనిచేసిన వారు గుర్తు పట్టారు. చంద్రహాస్ మరణించినట్లు తెలియగానే యాప్రాల్ లోని ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ మావోయిస్టులు, సానుభూతి పరులు , బంధువులు ఆయన ఇంటికి చేరుకున్నారు. మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. స్థానిక పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేనందున మృతదేహం ఎలా వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.