calender_icon.png 5 March, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిష్ఠాత్మకంగా మేడారం జాతర

05-03-2025 12:02:11 AM

  1. గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రణాళికలు
  2. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై దృష్టి
  3. ప్రణాళికలపై అధికారులకు ఆదేశాలు
  4. ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సురేఖ, జూపల్లి

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): సమ్మక్క-సారలమ్మ జాతర, గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు.

ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సచివాలయంలో మంగళవారం దేవాదాయ, అటవీ, పర్యావరణ, పర్యాటక, ఎక్సైజ్ శాఖల సమావేశం జరిగింది. రూ. వందల కోట్లతో చేపడుతున్న పనులు భవిష్యత్తులోనూ ఉపయోగపడేలా శాశ్వత ప్రాతిపదికన ప్రణాళికలు రచించాలని వెల్లడించారు. అందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలన్నారు.

అలాగే రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పర్యాటకం ఊపందుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అర్బన్ పార్కుల ఏర్పాటు, టైగర్ రిజర్వ్ ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా ఆయా శాఖలకు ఆదాయం సమకూరుతుందని అభిప్రాయపడ్డారు. పురాతన దేవాలయాల పునరుద్ధరణ పనులను ఆర్కియాలజీ డిపార్టెంట్ చేపట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు.

రాష్ట్రంలోని ఆరు ప్రధాన దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ల రూపకల్పనపై మంత్రులతో డిప్యూటీ సీఎం చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌తో పాటు పరిసరాల్లోని 59 అర్బన్ పార్కులను అభివృద్ధి చేసి వాటి ద్వారా ఆదాయం సమకూరే మార్గాలను అన్వేషించాలని సంబంధిత మంత్రులు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

అలాగే విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. పంటల సాగుతో అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, సోలార్ విద్యుత్ ద్వారా గిరిజన రైతులు పంపు సెట్ల వినియోగం వంటి కార్యక్రమాలపై చర్చించేందుకు అటవీ, గిరిజన, ఉద్యాన, వ్యవసాయ, ఇంధన శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.

కంపా పనులను పెద్ద ఎత్తున చేపట్టి పచ్చదనాన్ని కాపాడాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చెక్ డ్యామ్‌లు నిర్మాణ పనులను చేపట్టాలని భట్టి సూచించారు. 

ఆదాయం రాని ప్రాజెక్టులపై సమీక్ష...

తెలంగాణ రాష్ట్రం పర్యాటక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్న టూరిజం వనరులను వినియోగంలోకి తీసుకురావాలని, ప్రభుత్వానికి ఆదాయం రాని పీపీపీ ప్రాజెక్టులపై సమీక్షించాలని అధికారులకు సూచించారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ పరిసర ప్రాంతాల చుట్టూ కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీం, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రమా అయ్యర్, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియాల్,  కమర్షియల్ టాక్స్ కమిషనర్ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్  తదితరులు పాల్గొన్నారు.