చేగుంట (విజయక్రాంతి): క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుడ్యానికి ఎంతో ఉపయోగపడతాయని, రాష్ట్రస్థాయి క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులను జాతీయ స్థాయికి పంపించడం జరుగుతుందని ప్రతి ఒక్కరు స్నేహపూర్వకంగా క్రీడల్లో పాల్గొనాలని మెదక్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 16 నుండి 18వ తేదీ వరకు 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను మెదక్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ జ్యోతి వెలిగించి ఆరంభించారు, అనంతరం వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు వందన సమర్పణ నిర్వహించారు. ఈ క్రీడలలో తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల నుండి 240 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది.
క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి ఆర్థిక సహాయంతో పాటు బహుమతులను ఇవ్వడం జరిగింది. పోటీలకు వచ్చిన క్రీడాకారులకు పిఈటిలకు భోజన వసతి కల్పించారు, క్రీడోత్సవాలకు హాజరైన అతిథులకు వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు పరంజ్యోతి శాలువా మెమెంటోలతో సన్మానించారు. అనంతరం జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ, జిల్లా వాలీబాల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్, మండల విద్యాధికారి నీరజ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతిలు తాను మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడలతో స్నేహ సంబంధాలు పెరుగుతాయన్నారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను జాతీయస్థాయి పంపించడం జరుగుతుందని క్రీడల్లో గెలుపు ఓటమి సహజం కాబట్టి ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహపడకుండా రేపటి గెలుపుకు ముందుకు పోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రకళ, కర్ణం గణేష్ రవికుమార్, వివిధ జిల్లాల క్రీడోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.