calender_icon.png 26 December, 2024 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీకి స్ఫూర్తి మెదక్ చర్చి

26-12-2024 03:15:56 AM

  1. దేశవ్యాప్తంగా గుర్తింపు!
  2. కరువు ప్రాంతంలో వందేళ్లక్రితం కడుపునింపిన చర్చి నిర్మాణం
  3. చర్చి అభివృద్ధికి భవిష్యత్తులో మరిన్ని నిధులు
  4. ఇందిరమ్మ ఇండ్లలో దళిత, గిరిజన, క్రిస్టియన్ మైనార్టీలకు ప్రాధాన్యత 
  5. శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

మెదక్, డిసెంబర్ 25(విజయక్రాంతి): శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న మెదక్ చర్చికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంద ని, చర్చి అభివృద్ధికి తమ ప్రభుత్వ సహకారం ఎల్లవేళలా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మెదక్ చర్చిలో క్రిస్మ స్ వేడుకలు, శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ముందుగా సీఎంకు డయాసిస్ సభ్యులు, స్థానిక నాయకులు సాదర స్వాగతం పలికారు. చర్చి ప్రాంగణంలో రూ.29 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎంతోపాటు మంత్రులకు ఇన్‌చార్జి బిషప్ రూబెన్ మార్క్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి గురువు లు ఆశీర్వాదం అందించారు.

సీఎం మా ట్లాడుతూ.. వందేళ్ళ క్రితం చర్చి నిర్మా ణం కోసం చేపట్టిన పనికి ఆహారపథకం స్ఫూర్తితోనే ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకువచ్చిందన్నారు. వందేళ్ళు గా చర్చి నిర్వహణ అద్భుతమని, అందుకే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందన్నారు. కరువులో కొట్టుమిట్టాడు తున్న ఈ ప్రాంతంలో ప్రజల ఆకలి తీర్చేందుకు చర్చి నిర్మాణం చేపట్టారని గుర్తుచేశారు.

అదే స్పూర్తితో ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకువచ్చి పేదలకు అండ గా నిలిచిందన్నారు. తనకు మెదక్ చర్చితో మంచి అనుబంధం ఉందని, తాను పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ముఖ్యమంత్రి హోదాలో చర్చికి వస్తానని మాటనిచ్చానని, వందేళ్ళ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం తనకు దక్కిందన్నారు.

స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మైనంపల్లి హన్మంతరావు ప్రత్యేకంగా చర్చి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరిన వెంటనే మంత్రుల నిర్ణయంతో రూ.29 కోట్లు మంజూరు చేశానని, భవిష్యత్తులో చర్చి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 

జిల్లా అభివృద్ధిలో ముందుంటాం..

మెదక్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. ప్రభుత్వం మంజూరు చేసే ఇందిరమ్మ ఇండ్లలో దళిత, గిరిజన, క్రిస్టియన్ మైనార్టీలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల ఆరోగ్య బీమా, రైతాంగానికి రూ.500 బోనస్‌తో పాటు రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు.

గతంలో మిషనరీలు సేవా దృక్పథంతో విద్యా, వైద్యం అందించాయని, తమ ప్రభుత్వం కూడా అదేబాటలో పేదలకు సేవలందిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాక్షాంక్షలను తెలిపారు.

ఈ ఉత్సవాల్లో సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ్మ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి  హన్మంతరావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే మధుసూదన్‌రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.