సమస్యలపై చైర్మన్‌ను నిలదీసిన వైస్ చైర్మన్
మెదక్, జూన్ 29 (విజయక్రాంతి): మెదక్ మున్సిపాలిటీ సమావేశం చైర్మన్ టీ చంద్రపాల్ అధ్యక్షతన శనివారం వాడీవేడిగా సా గింది. ఈ సందర్భంగా పలువురు వార్డు కౌన్సిలర్లు తమ సమస్యలను తెలియజేయగా, సమస్యలపై ఫిర్యాదు చేయాలని చైర్మన్ చంద్రపాల్ సూచించడంతో వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్యామ్యాలు ఇస్తేనే వార్డుల్లో పనులు చేస్తా రా.. అంటూ మున్సిపల్ చైర్మన్‌పై వైస్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్‌లో మున్సిపల్ చెత్త ఆటో చెడిపోతే 9 నెలలుగా ఎందుకు మరమ్మతు చేయలేదని కౌన్సిలర్లు నిలదీశారు.
ప్రత్యేక శానిటేషన్ పేరుతో 50 మంది లేబర్లను పెట్టినట్లు ప్రియంబుల్‌లో పెట్టారని, ఆ కూలీల వివరాలు, పేర్లు, ఇచ్చిన ఇండెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలోనే ఆగ్రహించిన వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ వేదిక మీది నుంచి కిందికి దిగి వచ్చి తోటి కౌన్సిలర్లతో కూర్చున్నారు. టీయూఎఫ్‌ఐడీ నిధులు కొన్ని వార్డులకు మాత్రమే పెడుతున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించగా.. అవసరం ఉన్న వార్డులకే పెట్టామని కమిషనర్ తెలిపారు. అయితే అన్ని వార్డులకు ప్రాధాన్యత ఇస్తామని చైర్మన్ హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు.