calender_icon.png 10 January, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాలకు యంత్రాంగం.. ఇక్కట్లకు పరిష్కారం

10-01-2025 12:00:00 AM

  • మెదక్ జిల్లాకు 324 మంది వీఎల్‌వోల నియామకం

929 మందికి 324 మంది వెబ్ ఆప్షన్

గడువు పెంచితే మరికొంత అవకాశం 

మెదక్, జనవరి 9 (విజయక్రాంతి)ః గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరి చొప్పున అధికారులను నియమిస్తున్నట్లు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

గత ప్రభుత్వం వివిధ శాఖల్లోకి బదలాయించిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు(వీఆర్‌వో), విలేజ్ రెవెన్యూ అసిస్టెం ట్లు (వీఆర్‌ఏ)కు విలేజ్ లెవెల్ ఆర్గనైజేషన్ అధికారులు (వీఎల్‌వో)గా అవకాశం కల్పిస్తోంది. ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు గతనెల వరకు గడువు విధించింది. దీంతో మెదక్ జిల్లాకు 324 మంది రానున్నారు. ప్రభుత్వం తీసు కున్న నిర్ణయంతో చాలా మంది వచ్చేందుకు ఆస క్తి  చూపుతున్నారు. అరులను గుర్తించి ఎంపిక చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిం చింది. ఈ ప్రక్రియ వారం రోజుల క్రితమే పూర్తవడంతో త్వరలోనే అధికా రులను అందించే అవకాశముంది.

సమస్యల పరిష్కారం కోసమే..

రెవెన్యూ శాఖలో సిబ్బంది  కొరత తీవ్రంగా  ఉంది. గత ప్రభుత్వం వీఆర్‌ఏలు, వీఆర్వోలను ఇతర శాఖల్లోకి పంపడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. మండల కార్యాలయాల్లో పనిచేసే ఆర్‌ఐలు కూడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో సేవలు అందడం లేదు. కొత్త వ్యవస్థ పటిష్టంగా మారితే చాలా వరకు సమస్యలు తీరనున్నాయి.

జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, వెల్దుర్తి, శివ్వంపేట, రేగోడు, అల్లాదుర్గం, పాపన్నపేట తదితర మండలాల్లో మట్టి, ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది.

అధికార యంత్రాంగానికి సమాచార లోపంకూడా తోడవడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అంతేగాకుండా ప్రభుత్వ భూముల పరిరక్షణ కూడా కొరవడింది. ఇష్టారీతిగా కబ్జాలకు పాల్పడుతున్నాచర్యలు తీసుకోలేని పరిస్థితి దాపురిం చింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడనుందని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. 

929 మందికి 324 మంది వెబ్ ఆప్షన్..

మెదక్ జిల్లా వ్యాప్తంగా 145 మంది వీఆర్వోలు, 784 మంది వీఆర్‌ఏలు కలిపి మొత్తంగా 929 మంది ఉన్నారు. ఇందులో సగం మంది మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం జరిగింది. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది.

తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వీఎల్‌వో వ్యవస్థను తీసుకురావడంతో వీఆర్‌వో, వీఆర్‌ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవడా నికి శ్రీకారం చుట్టింది. అయితే మెదక్ జిల్లాలో మాత్రం 92 మంది వీఆర్‌వోలు, 232 మంది వీఆర్‌ఏలు మొత్తం 324 మంది మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు. వెబ్ ఆప్షన్‌కు మరోసారి గడువు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. 

జిల్లాలో ఇలా..

  • నియోజకవర్గాలు  2
  • మండలాలు  21
  • పంచాయతీలు  493
  • రెవెన్యూ గ్రామాలు  381

పర్యవేక్షణ సులభతరం..

భూ పరిపాలన సమస్కరణల్లో భాగంగా ప్రభుత్వం గ్రామస్థాయిలో అధికారులను నియమిస్తోంది. ప్రభుత్వ భూముల పరిరక్షణ, అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారం, ప్రజలకు క్షేత్రస్థాయిలోనే వివిధ రకాల సేవలను అందించేందుకు కొత్త వ్యవస్థ ప్రయోజనకరంగా మారనుంది. జిల్లా అంతటా సిబ్బంది సేవలు అందుబాటులోకి వస్తే పర్యవేక్షణకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే వీఆర్‌వో, వీఆర్‌ఏలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. 

 మెంచు నగేశ్, అదనపు కలెక్టర్, మెదక్ జిల్లా