calender_icon.png 23 October, 2024 | 6:05 AM

‘బ్రెయిన్ స్ట్రోక్’కు మెకానికల్ థ్రోంబెక్టమీ చికిత్స

03-08-2024 04:48:40 AM

నలుగురు పేషెంట్ల జీవితాలను కాపాడిన అపోలో వైద్యులు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 (విజయక్రాంతి): అపోలో ఆసుపత్రి వైద్యులు 24 గంటల పాటు  శ్రమించి బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు మెకానికల్ థ్రోంబెక్టమీ విధానం ద్వారా చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్టు అపోలో వైద్య బృందం తెలిపింది. ఈ విధానంలో నలుగురు బాధితు లకు చేపట్టిన చికిత్సలో ముగ్గురు 74 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఉన్నారని తెలిపారు. శుక్రవారం డాక్టర్ సురేష్ గిరగాని మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు, వైక ల్యానికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రధాన కారణం అని అన్నారు. ఆకస్మిక తిమ్మిరి, బలహీనత, గందరగోళం, మాట్లాడడంలో ఇబ్బంది, తీవ్రమైన తలనొప్పి వంటివి ముందే గుర్తించి చికిత్స తీసుకున్నట్టయితే ప్రమాదం నుంచి బయటపడవచ్చని తెలిపారు.

ప్రముఖ అంత ర్జాతీయ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్ గిరగాని, న్యూరాలజిస్టులు డాక్టర్ సుధీర్, డాక్టర్ రాజేశ్ రెడ్డి, డాక్టర్ సందీప్ నాయని, డాక్టర్ యశ్వంత్‌తో పాటు ఎమర్జెన్సీ ఫిజీషియన్లు, న్యూరో అనస్థీషియన్లు, స్పెషలైజుడ్ నర్సింగ్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం 24 గంటలు శ్రమించి నలుగురు బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు మెకానికల్ థ్రోంబెక్టమీ ప్రొసీజర్‌ను విజయవంతంగా చేశామన్నారు. పేషెంట్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన 24 గంటలలోపు ఈ ప్రొసీజర్ ద్వారా చికిత్స చేసినట్టయితే జీవితాన్ని కాపాడవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియలో మెదడులో గడ్డ కట్టిన రక్తాన్ని తొలగిస్తారని వెల్లడించారు.