- వనపర్తి జిల్లా చింతలకుంటలో ఏండ్లుగా వస్తున్న ఆచారం
- కోళ్లు, మేకలను బలిస్తున్న భక్తులు
వనపర్తి, ఆగస్టు 3(విజయక్రాంతి): ఆంజనేయస్వామి అంటేనే నియమ నిష్టలకు మారుపేరు. ఆజన్మ బ్రహ్మచారి అయిన అంజన్నకు వడలు తీర్థ ప్రసాదాలను నైవేద్యం గా పెట్టడం ఆనవాయితీ. కానీ వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం పాతపల్లి గ్రామంలోని చింతలకుంట ఆంజనేయస్వామికి మాత్రం భక్తులు మాంసాన్ని నైవేద్యంగా పెట్టి, మొక్కులను చెల్లించుకుంటారు. అనేక ఏళ్ల నుంచి ఈ ఆనవాయితీ ఇక్కడ కొనసాగుతున్నది. పాతపల్లి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో వెలిసిన చింతలకుంట ఆంజనేస్వామికి గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేయడంతో పాటు కోరికలు తీరితే మాంసాన్ని నైవేద్యంగా పెడుతారు.
చింతలకుంట స్థల పురాణం
పాతపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో వెలసిన ఆంజనేయస్వామిని చింతలకుంట ఆంజనేయస్వామిగా భక్తులు పిలుచుకుంటారు. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం ముందు పొట్టేళ్లు, మేకలు, కోళ్లను బలిస్తారు. స్థల పురాణం ద్వారా పూర్వం ఆలయ పరిసరాల్లో చింతచెట్లు భారీగా పెరిగి అడవిని తలపించేలా ఉండేది. ఆ అడవుల పరిసర ప్రాంతాల్లో రాక్షసులు సంచరిస్తూ ప్రజలను, పశువులను చంపి తినేవారు. రాక్షసుల నుం చి కాపాడాలని ప్రజలు ఆంజనేయస్వామిని వేడుకున్నారు. ప్రజల భక్తిని మెచ్చిన ఆంజనేయస్వామి రాక్షసులను వధిస్తూ వస్తున్న క్రమంలో స్వామివారి శక్తిని రాక్షసులు తెలుసుకున్నారు.
లంకలోని రావణాసురుడిని వణికించి, మృత్యువును జయించి చిరంజీవిగా అవతరించాడని తెలుసుకుంటారు. ఆం జనేయస్వామిని గెలవడం కష్టమని భావించిన రాక్షసులు స్వామివారిని భక్తితో కొలచి ప్రసన్నం చేసుకున్నారు. రాక్షసులైన తాము ఆహారం కోసం ప్రజలను, జంతువులను చంపక తప్పదని, తమను అనుగ్రహించాలని వేడుకున్నారు. శాంతించిన ఆంజనే యస్వామి రాక్షసుల ఆకలి తీర్చేందుకు అభయమిచ్చాడు. అభయం మేరకు భక్తులు జంతు బలిస్తారని, నైవేద్యంగా మారిన ఆహారాన్ని భుజించి ఆకలి తీర్చుకోవాలని ఆం జనేయుడు సూచించాడు. అప్పటి నుంచి భక్తులు జంతు బలి ఇస్తూ వస్తున్నారు.
ఏటా సంక్రాంతి పర్వదినాన జాతర
కోరికలు తీర్చే కొంగు బంగారంగా చింతలకుంట ఆంజనేయస్వామి ప్రసిద్ధిగాంచారు. భక్తులెవ్వరైనా స్వామిని దర్శించి నిష్టతో వేడుకుంటే కోరికలు తీరుస్తాడని విశ్వసిస్తారు. కోరికలు తీరగానే భక్తులు బంధు మిత్రులతో తరలివచ్చి కోళ్లు, పొట్టేళ్లను ఆలయం ఎదుట బలిస్తారు. మాంసాన్ని వండి నైవేద్యంగా సమర్పిస్తారు. పిల్లలకు పుట్టువెంట్రుకలు తీయించి, మొక్కు చెల్లించుకుంటారు. చింతలకుంట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద సంక్రాంతికి రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. భక్తులు ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు చుట్టు పక్కలా జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తరలివస్తారు.
చింతలకుంట నామకరణం ఇలా..
చింతలకుంట ఆంజనేయస్వామి ఆలయానికి సుమారుగా 300 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఈ ప్రాంతం లో అడవికి వెళ్లిన పశువుల కాపరులు ముందుగా ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తించారు. అటువైపు వెళ్లిన పశువుల కాపరులతో పాటు కొందరు స్థానికులు స్వామివారి విగ్రహానికి పూజలు చేసి, కోరిన కోరికలు తీర్చడంతో.. స్వామివారి భక్తి ప్రాబల్యం ఆ నోట ఈ నోట వెలుగులోకి వచ్చింది. దీంతో కోరుకున్న కోరికలు తీరడంతో శ్రీరంగాపూర్ వాసుదేవరావు చిన్నపాటి గుడిని నిర్మించారు. ఈ గుడి సమీపంలో చింతలచెరువు ఉం డటంతో ఈ ఆలయానికి చింతలకుంట ఆంజనేయస్వామి అని పేరు వచ్చింది.
మాంసం నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ
మా తాతల కాలం నుంచి చింతలకుంట ఆంజనేయస్వామికి నిత్య పూజలు చేస్తున్నాం. ఆంజనేయస్వామి పాదాల కింద అణగతొక్కపడిన రాక్షసుల ఆకలిని తీర్చేందుకు భక్తుల కోరికలను నెరవేరుస్తున్నాడు. భక్తులు మొక్కుబడిగా ఆలయం ఎదుట కోళ్లను, పొట్టేళ్లను, మేకలను కోస్తూ వండిన ఆహారాన్ని నైవేద్యంగా పెడుతారు. ఆ నైవేద్యంతో రాక్షసుల ఆకలి తీరుతుంది. ఏటా సంక్రాంతి పర్వదినాన పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తాం.
- వెంకటేశ్వర్లు, ఆలయ పూజారి