calender_icon.png 4 February, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

03-02-2025 11:01:18 PM

అయ్యప్ప సొసైటీ ఫిల్లింగ్ స్టేషన్ ను సందర్శించిన ఎండీ అశోక్ రెడ్డి

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలోని ఫిల్లింగ్ స్టేషన్ ను హెచ్ఎం డబ్ల్యూఎస్ ఎండీ అశోక్ రెడ్డి సందర్శించారు.గత కొన్ని రోజులుగా ట్యాంకర్ బుకింగ్స్ పెరగడంతో ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ మీద దృష్టి సారించింది. ఇందులో భాగంగానే  మాదాపూర్ ఫీలింగ్ స్టేషన్ ను సందర్శించారు.మొదటగా ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి ట్యాంకర్ ఫిల్లింగ్,టోకెన్ జనరేషన్ వివరాలు తనిఖీ చేశారు.ఇక్కడ ప్రస్తుతం ఉన్న 3 ఫిల్లింగ్ స్టేషన్లతో మరో 3 ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.డిమాండ్ ను బట్టి ట్యాంకర్ల సంఖ్యను సైతం పెంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ...గతేడాది లాగే భూగర్భ జలాలు అడుగంటడంతో ట్యాంకర్ పెరిగే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

ఒక ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ లోపలికి వచ్చి.. నీటిని నింపుకొని బయటికి వెళ్లేందుకు దాదాపు 8-10 నిమిషాలు పడుతుందని ఆయన అన్నారు.ఈ సమయాన్ని 5 నిమిషాలకు తగ్గిస్తే ఒకరోజులో రెట్టింపు ట్రిప్పులను డెలివరీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ సమయాన్ని తగ్గించుకోవడానికి అన్ని ఫిల్లింగ్ స్టేషన్ల పరిసరాల్లో పలు మార్పులు చేర్పులు చేయాలని సూచించారు.ట్యాంకర్ వచ్చి వెళ్లడానికి మంచి అంతర్గత రోడ్లను నిర్మించుకోవాలని, ఫిల్లింగ్ బే (ట్యాంకర్లలో నీరు నింపే ప్రాంతం) సరైన విధంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే ఎక్కువ ట్యాంకర్లు బుక్ అయ్యే ఫిల్లింగ్ స్టేషన్ లో అదనపు ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.పగటి సమయంలో గృహ వినియోగదారులకు,రాత్రి వేళల్లో హాస్టళ్లు, హోటళ్ల వంటి వాణిజ్య వినియోగదారులకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు.

దీని వల్ల వెయిటింగ్ పిరియడ్, పెండెన్సీ తగ్గించవచ్చన్నారు.ట్యాంకర్ బుకింగ్ లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ హెచ్చరించారు.ప్రతి ట్యాంకర్ టోకెన్ పై బార్ కోడ్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.దీని వల్ల ప్రతి ట్రిప్పుల లెక్కలు పక్కాగా ఉంటాయన్నారు.మరుగుదొడ్లు,వెయిటింగ్ రూమ్ లు లేని ఫిల్లింగ్ స్టేషన్లలో వాటిని ఏర్పాటు చేయాలని చెప్పారు.రాత్రి సమయంలో లైటింగ్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎండీ తెలిపారు.ఇవి ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయానికి అనుసంధానమై ఉంటాయన్నారు.దీని వల్ల ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నట్లు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో జీఎం బ్రిజేష్, డీజీఎం,మేనేజర్,తదితరులు పాల్గొన్నారు.