calender_icon.png 20 January, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు

03-07-2024 12:14:24 AM

  1. డెంగ్యూపై అవగాహన కలిగి ఉండాలి
  2. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (విజయక్రాంతి): వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ, మలేరియా ప్రబలే అవకాశం ఉన్నందున, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని హైదరా బాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన డీసీసీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని వైద్యారోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని, మందులు, టెస్టింగ్ కిట్స్‌ను అందుబా టులో ఉంచాలని సూచించారు. విషజ్వరాలు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని జీహెచ్‌ఎంసీ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. 

వార్డు, సర్కిల్, యూపీహెచ్‌సీ వారీగా ఐదేండ్లలో ఏ ప్రాంతాల్లో ఎక్కువ ప్రమాదకర కేసులు వస్తున్నాయో తెలుసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకట్, జీహెచ్‌ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజ, చీఫ్ ఎంటమాలజిస్ట్ రాం బాబు, సర్వేలెన్స్ అధికారి డాక్టర్ హర్ష, ఇన్‌చార్జి డీఎంవో నిరంజన్, జిల్లా సంక్షేమ అధి కారులు ఆశన్న, యాదయ్య, కోటాజీ, ఇలియాజ్ అహ్మద్ పాల్గొన్నారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి : అడిషనల్ కమిషనర్

హైదరాబాద్‌లో డెంగ్యూ కేసుల నివారణకు ప్రతినెలా హెల్త్ క్యాలెండర్ కార్యాచ రణను రూపొందించాలని, దీనికి అనుగుణంగా అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేయాలని జీహెచ్‌ఎంసీ హెల్త్ విభాగం అడిషనల్ కమిషనర్ రవికిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ ఎంసీ హెల్త్ విభాగానికి సంబంధించిన పలు సెక్షన్ల అధికారులతో మంగళవా రం సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్‌లో ప్రతి డెంగ్యూ కేసును ఒక హాట్ స్పాట్‌గా భావించాలని, ఆ ప్రాంతం లో 10 రోజుల పాటు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏరియాలో 6 రోజులకోసారి ఫాగింగ్ చేయాలన్నారు. స్థానికంగా ఉండే కాలనీలు, బస్తీ కమిటీల నాయకులతో చర్చించి దోమల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అత్యధిక డెంగ్యూ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గ్రేటర్‌లో 60 కేసులు నమోదు..

జీహెచ్‌ఎంసీ పరిధిలో గతేడాది 130 డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జూన్ మాసం నాటికి 60 కేసులు నమోదైనట్టుగా వెల్లడించారు. కేసుల సంఖ్య ఈ ఏడాది మార్చి నుంచి తగ్గుముఖం పడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.