21-03-2025 01:20:20 PM
-ఆకస్మికంగా వాహనాల తనిఖీలు చేయాలి..
-ప్రతి ఒక్కరు వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలి..
-సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐసీసీ సమావేశ మందిరం లో నిర్వహించిన రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా లోని ,వివిధ శాఖల అధికారులతో కలసి రోడ్డు భద్రతా చర్యలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్ టి ఓ ,పోలీస్ అధికారులను ఆదేశించారు . ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి, ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలను గుర్తించాలన్నారు. కొత్త బ్లాక్ స్పాట్లను గుర్తించి, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు, ఈ బ్లాక్ స్పాట్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు. జాతీయ రహదారులకు ఇరువైపులా చెత్త వేసీవారి పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారులకు పక్కన ఉన్న మద్యం దుకాణాలు, ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ఎక్సైజ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ఆర్ అండ్ బీ శాఖ నుండి అసిస్టెంట్ ఇంజినీర్ ఏఇ), పోలీసు శాఖ నుండి ఒక అధికారి కలసి ఒక సమన్వయ బృందంగా పనిచేయాలన్నారు. ప్రధాన జాతీయ రహదారి జిల్లాలో ఉన్నందున నిర్మాణంలో ఏవైనా లోపాలు ఉన్న సరిచేయాలని, ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో మరమ్మతులు చేయాలని తెలిపారు.
జాతీయ రహదారులకు అందుబాటులో అంబులెన్సులు, పెట్రోలింగ్ వాహనాలు, జేసీబీ, క్రేన్లు ఉండాలని సూచించారు. స్పీడ్ గన్ తనిఖీలు క్రమం తప్పకుండా రొటీన్ పద్ధతిలో కాకుండా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలని అన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న మూలమలుపులు, కల్వర్టులు, ఎత్తుపల్లాలు, నిర్మాణ లోపాలను పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రమాద ప్రాంతాలలో వాహనదారులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. రవాణా శాఖ అధికారులు వాహనాల లోడ్ ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించాలని సూచించారు. ఆర్టీసీ డ్రైవర్లు, ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లు రోడ్డు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పోలీస్, ఆర్అండ్ బీ, రోడ్ ట్రాన్స్‌పోర్ట్, ఆర్టీసీ, పంచాయతీ రాజ్, జాతీయ రహదారుల వంటి అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్ , అదనపు కల్లెక్టర్ మాధురి , అదనపు ఎస్పీ సంజీవరావు , జిల్లా వైద్యాధికారిణి గాయత్రీ దేవి , జిల్లా రవాణా అధికారి అనిత, ఆర్డీఓలు , ఆర్ అండ్ బి అధికారులు , పోలీస్, రవాణా, పంచాయతీ రాజ్, జాతీయ రహదారుల సంస్థ, ఆర్టీసీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మునిసిపల్ అధికారులు , తదితరులు, పాల్గొన్నారు.