ఆర్థిక సర్వేపై నిపుణుల వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూలై 22: నైపుణ్యాన్ని, ఉత్పాదకతను మెరుగుపర్చేందుకు ప్రైవేటు రంగ పెట్టుబడులు పెంపునకు చర్యలు తీసుకోవాలని బడ్జెట్ ముందస్తు ఆర్థిక సర్వే సూచిస్తున్నదని నిపుణులు తెలిపారు. ప్రతీ ఏడాది సాధరణ బడ్జెట్‌కు ముందురోజున విడుదల అయ్యే ఆర్థిక సర్వేను సోమవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించారు.ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ పర్యవేక్షణలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ సర్వేను రూపొందిస్తుంది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల్ని, వివిధ రంగాల సూచికలను, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కొన్ని అంచనాలను ఈ బడ్జెట్ ముందస్తు డాక్యుమెంటులో పొందుపరిచారు.
ప్రైవేటు రంగ పెట్టుబడుల ద్వారా నైపుణ్యాన్ని, ఉత్పాదకతను, భౌతిక, డిజిటల్ కనెక్టివిటీని పెంచాల్సిన అవసరాన్ని సర్వే నొక్కిచెపుతున్నదని డెలాయిట్ ఇండియా ఎకానమిస్ట్ రుమ్‌కి మజుందార్ అన్నారు. ప్రజల ఆదాయాన్ని, నైపుణ్యాన్ని పెంచడానికి ఎంఎస్‌ఎంఈలు, వ్యవసాయం, విద్య, ఉపాధి కీలకమైనవని ఆమె వ్యాఖ్యానించారు. మధ్యకాలికంగా వృద్ధికి ప్రైవేటు కార్పొరేట్ రంగం, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతుగా నిలవాల్సిన అవసరాన్ని సర్వే సూచిస్తున్నదని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. ద్రవ్యల్బణం అదుపునకు, ప్రత్యేకించి ఆహారోత్పత్తుల ధరల విషయంలో రిజర్వ్‌బ్యాంక్ మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా చురుగ్గా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సర్వే సిఫార్సుచేసిందన్నారు.
వృద్ధికి నమూనా
దేశ వృద్ధికి నమూనాను ఆర్థిక సర్వే సూచిస్తున్నదని, పలు రంగాల నుంచి ప్రత్యేకించి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల తోడ్పాటు అవసరాన్ని తెలియపర్చిందని సీఐఐ సదరన్ రీజియన్ ఎంఎస్‌ఎంఈ చైర్మన్ పి.గణేశ్ చెప్పారు.