వనపర్తి,(విజయక్రాంతి): జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి అగుచున్న ప్రతి యువతను ఎలక్టర్ జాబితాలో చేర్చేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ సమ్మరీ రివిజన్ పై సమీక్ష నిర్వహించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 2011లో 4,5 సంవత్సరాల వయస్సున్న పిల్లల సంఖ్యను అన్ని మండలాల తహశీల్దార్లకు ఇవ్వడం జరిగిందని, వాటి ప్రకారం ఇప్పుడు ఎంతమంది 17, 18 సంవత్సరాల వయస్సు యువత ఉంటారో తెలిసిపోతుందన్నారు. ఇప్పుటి వరకు తహశీల్దార్లు తీసుకున్న ఫారం 6 చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయని తెలిపారు.
అర్హులైన యువత నుండి ఫారం 6 తీసుకోడానికి కళాశాలలు, పెళ్లి అయిన జంటలను గుర్తించాలని సూచించారు. అదేవిధంగా మరణించిన ఓటర్ల పేర్లను ఫారం 7 ద్వారా జాబితా నుండి తొలగించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఓటర్ల నమోదుకు సహకారం తీసుకోవాలని సూచించారు. ఎలక్టరల్ రోల్ జాబితాలో దివ్యంగులను గుర్తించి మార్కింగ్ చేయాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేశన్ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు. కొత్తగా పోలింగ్ స్టేషను కావాలనుకుంటే తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, ఆర్డీఓ పద్మావతి, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.