22-02-2025 01:36:29 AM
గద్వాల, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ప్రస్తుత రబీ సీజన్,రానున్న వేసవిలో జిల్లాలో నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జూరాల జనరేషన్ ప్లాంట్,220/132 కేవీ జూరాల సబ్ స్టేషన్,132/33 కేవీ ,33/11 కేవీ గద్వాల్ సబ్ స్టేషన్, మానిటరింగ్ సెల్ లను ఆకస్మికంగా తనిఖీ చేసి,అక్కడి పరిస్థితులను సమీక్షించారు. '
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యుత్ సరఫరా ఎక్కడి నుండి వస్తుంది, ఎంత మేరకు సరఫరా అవుతోంది, సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఏ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారు,ఎంత మంది సిబ్బంది విధుల్లో ఉంటారు అనే అంశాలను విద్యుత్ శాఖ ఇంజినీర్ ను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం విద్యుత్ సరఫరా, నిర్వహణ, డిమాండ్-సరఫరా అంశాలపై అధికారులతో సమీక్షించారు.