జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటశాలను పరిశీలించి ,విద్యార్థులకు మధ్యాహ్న అందించే వంటలను, స్టోర్ రూమ్ లోని సరుకులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఎప్పటికప్పుడు తాజా కూరగాయలతో వంటలు చేయాలన్నారు. కాలం చెల్లిన సరుకులను ఉపయోగించకూడదని సూచించారు.
తొమ్మిదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు గణితంపై పలు ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి విద్యార్థులకు సబ్జెక్టుల వారిగా పాఠాలు పూర్తిచేసి తిరిగి సిలబస్ మరోసారి రివిజన్ పై దృష్టి సారించాలన్నారు. పది ఫలితాల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థినిలను సన్నద్ధం చేయాలని సూచించారు. గురుకుల పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రత్నా బాయి, ఉపాధ్యాయునిలు, విద్యార్థులు పాల్గొన్నారు.