calender_icon.png 22 December, 2024 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలి

13-09-2024 05:29:07 PM

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి -  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి, (విజయక్రాంతి): విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడంతో పాటు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం ఉదయం శ్రీరంగపూర్ మండలంలోని ఎస్సి వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహంలో డార్మీటరీ ని పరిశిలించడంతో పాటు ఆహార పదార్థాల నిలువ రిజిస్టరు, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆహార పదార్థాల సామాగ్రి వచ్చినప్పుడు విధిగా  మెస్ కమిటీ విద్యార్థుల సంతకాలు రిజిస్టరులో తీసుకోవాలని సూచించారు.వసతి గృహం ఆవరణలో ఉన్న గుంతలో నీటి నిల్వను గమనించిన కలక్టర్ ఉపాధి హామీ పని ద్వారా గుంతను పూడ్పించాలని ఎంపీడీఓ ను ఆదేశించారు.

శేరిపల్లి శివారులో రంగసముద్రం నీటి ద్వారా దెబ్బతిన్న వ్యవసాయ పొలాలను పరిశీలన

ఇటీవల అధిక వర్షాల వల్ల రంగశముద్రం నుండి నీటి విడుదల ద్వారా దిగువన ఉన్న పంట పొలాల్లో జరిగిన నష్టాన్ని కలక్టర్ పరిశీలించారు.  రంగాసముద్రం నుండి నీటి విడుదల జరిగినప్పుడు దిగువన నిర్ణీత  కాలువ లేకపోవడం వల్ల నీరు పంట పొలాల వెంట అధికంగా పారడంతో పంటలు కొట్టుకుపోతున్నాయని రైతులు కలక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలెక్టర్ ఇరిగేషన్ శాఖ  ద్వారా సర్వే చేయించి పరిష్కార మార్గాలు చూస్తామని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించాలి

రంగాపూర్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు.  విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించిన కలక్టర్ ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.  అంగన్వాడి కార్యకర్త పోస్టు గత మూడు సంవత్సరాలుగా ఖాలీగా ఉన్న విషయాన్ని గ్రామస్తులు కలక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు.

రంగాపూరు ఘాట్ వద్ద పోలీస్ పహారా పెట్టండి

వినాయక నిమజ్జనానికి రంగపూర్ ఘాట్ వద్దకు తీసుకువస్తే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను, ఎంపీడీఓను ఆదేశించారు. 

పెబ్బేరు - వనపర్తి రహదారి విస్తరణ పనులు ప్రారంభించండి

పెబ్బేరు నుండి వనపర్తి వెళ్లే రహదారి విస్తరణ పనులు   రోడ్డు పై నుండి విద్యుత్  స్తంభాలను పక్కకు జరపాల్సి ఉండటంతో విస్తరణ పనులు ఆగిపోయినట్లు మున్సిపల్ కమిషనర్ కలక్టర్ దృష్టికి తెచ్చారు. పరిశీలించిన కలక్టర్ విద్యుత్ స్తంభాలు మార్చేందుకు అవసరమైన నిధులు  మున్సిపాలిటీ నుండి సగం ఇవ్వాలని మిగిలిన సగం కలెక్టర్ ప్రత్యేక నిధుల నుండి ఇవ్వనున్నట్లు తెలిపారు. వారం లోపల రోడ్డు విస్తరణ  పనులు పునఃప్రారంభం కావాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.పెబ్బేరు మున్సిపాలిటీ లో ఉన్న   మహాత్మ జ్యోతి భా పాపులే బి.సి. బాలికల గురుకుల పాఠశాలను కలక్టర్ సందర్శించారు. ఆహార పదార్థాల రిజిస్టరు ను పరిశీలించిన కలక్టర్ స్టాక్ వచ్చినప్పుడు విద్యార్థుల మెస్ కమిటీ ద్వారా సంతకాలు విధిగా తీసుకోవాలని సూచించారు.

గురుకుల పాఠశాలకు 460 మంది విద్యార్థిని లు ఉన్నారని, డార్మెటరీ, తరగతి గదులు ఒకే చోట ఉండటం, సరిపడా మరుగుదొడ్లు లేకపోవడం, వర్షాకాలంలో గదులు వర్షపు నీటితో కురవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,  మరో భవనంలోకి మార్చవలడిందిగా ప్రిన్సిపాల్ కలక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలక్టర్ మంచి భవనం చూసి ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ చైర్ పర్సన్ కరుణశ్రీ నీ సూచించారు. 

గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలి

పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలక్టర్ ఏ.ఎన్ సి., ఈ.డి.డి. రిజిస్టర్లను పరిశీలించారు.  మొదటి త్రైమాసికంలో నమోదు చేసిన గర్భిణీలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ సమయానికి వైద్యం అందిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే ప్రసవం జరిపించే విధంగా చూడాలని సూచించారు. పెబ్బేరు మండల అభివృద్ధి అధికరింకార్యాలయంలో స్థానిక సంస్థల ఎలక్టరల్ రోల్ ప్రకటనను పరిశీలన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం శుక్రవారం  అన్ని పంచాయతీ కార్యాలయాల్లో, మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఓటరు జాబితా ప్రకటించాల్సి ఉండగా జిల్లా కలెక్టర్ పెబ్బేరు ఎంపీడిఓ కార్యాలయంలో తనిఖీ చేశారు.  జాబితాలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని పరిశీలించారు. పెబ్బేరు  మున్సిపల్ కమిషనర్ ఆది శేషు, మున్సిపల్ చైర్ పర్సన్ కరుణశ్రీ,  శ్రీరంగాపూర్, పెబ్బేరు తహశీల్దార్లు, ఎంపీడీఓ, డిప్యూటీ డి.యం అండ్ హెచ్. ఒ డా. సాయినాథ్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ ప్రవలిక, మెడికల్ ఆఫీసర్, పాటశాల ఉపాద్యాయులు తదితరులు కలక్టర్ వెంట ఉన్నారు.