calender_icon.png 6 April, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్రికా రచయితగా నేను!

17-03-2025 12:00:00 AM

ఈ క్రొత్త జీవితానికి నాకు యెంత అర్హత యున్నదో ఆలోచించలేదు. పత్రికా రచన గురించి నేను యెక్కడా ‘తర్బియత్’ (ట్రైనింగ్) పొందలేదు. కనీసం బాగా నడుస్తున్న పత్రికల్లో చేరి పని నేర్చుకొని యుండలేదు. అనుభవము సాధించి యుండలేదు. నిజంగా విచారిస్తే యే విశ్వవిద్యాలయములోనైనా చేరి పత్రికా రచనకు అనుగుణమైన రాజకీయ, ఆర్థిక విషయాల గురించి విద్యాభ్యాసము చేయు భాగ్యము నాకు లభించలేదు. నేను ఎంతవరకు సమర్థుడనా యను విషయమాలోచించకుండ ఈ రంగములో కాలు పెట్టినాను. 

మాడపాటి హనుమంతరావు పంతులుగారు ప్రోత్సహించినారు. నేను ధైర్యము చేసి నాను. ఆ కాలములో ప్రభుత్వ సమాచార శాఖ అనునది యేదీ లేదు. పత్రికా ముద్రణ గురించిన నియమాలను అనుసరించి సర్వాధికారాలు పట్టణ పోలీసు కమీషనరు (కొత్వా ల్)కే ఉండేవి. పత్రికా ముద్రణకు సంబంధించిన దరఖాస్తు కొత్వాల్ సాహెబువద్ద పెట్టు కోవలసి వచ్చేది. దరఖాస్తు మంజూరు చేసే అధికారము కోత్వాలుదే. పత్రికలను కంట్రోలులో పెట్టుకునే సర్వాధికారాలు కొత్వాల్ సాహెబు కుండేవి. ఆ కాలములో రాజబహాద్దూర్ వెంకట రామారెడ్డి గారు కొత్వాల్ పద విపై నుండిరి. నేను ‘రయత్’ వారపత్రిక ముద్రించుటకు వీరివద్దనే దరఖాస్తు పెట్టుకొని, అనుమతి పొందితిని.

పత్రికా నిర్వహణకు కావలసిన యేర్పాట్లు యేమీ లేవు. ఆర్థికంగా కూడా యే యేర్పాట్లు లేవు. నా ఆర్థిక పరిస్థితి యేమీ బాగా లేదు. పెట్టుబడి పెట్టు నాగస్థుడు కాని లేక యజమాని కాని లేడు. నేనే యజమానిని, నేనే ఉద్యోగిని, నేనే పెట్టుబడిదారుడను. నేనే కార్మికుడను, నేనే వర్కింగు జర్నలిస్టును! నూరు రూపాయల మూలధనముతో పత్రిక ఆరంభించినాను. మొదటి సంచిక శ్రీమతి సరోజినీదేవి నాయుడుగారి శుభాశీస్సులతో బయలుదేరినది. ప్రధానమంత్రిగా నున్న సర్ మహారాజ కిషన్ పర్‌షాద్ తమ ఉర్దూ కవితద్వారా ప్రోత్సహిస్తూ, వ్రాసిన గీతాలతో రెండ వ సంచిక బయలుదేరినది. నూరు రూపాయలు విరాళము నొసంగి, మహారాజ బహ ద్దూర్ ధనసహాయము గావించినారు. ఇంతకు మించిన ఆర్థిక యేర్పాటు యేదీ లేకుండెను.

కేశవరావు ఇంతవరకు హైకోర్టు జడ్జిగా నుండి, అపుడపుడే తమ పదవి విరమించుకొని యుండిరి. వీరు ‘దక్కన్ లా రిపోర్టు’ అను ఒక మాసపత్రిక ప్రచురించేవారు. అందులో హైకోర్టు తీర్పులు ముద్రింపబడేవి. వీరిది అదే పేరుతో దక్కన్ లా రిపోర్టు ప్రెస్ అను ఒక ముద్రణశాల కూడా ఉండేది. కేశవరావు తమ ముద్రణశాలలో నేను ప్రచురించు ‘రయ్యత్’ పత్రికను అచ్చువేసే యేర్పా టు చేసి, నాపైన వారం వారం పడుతున్న ఆర్థిక వత్తిడిని సడలించిరి. ఇప్పుడు ఆర్యసమాజ ప్రముఖ నాయకుడైన పండిట్ నరేంద ర్‌జీ ఆ కాలములో మంచి ఉత్సాహముగల యువకుడు. (వీరు ఇటీవలే దివంగతులైరి). ఆయన కొన్ని మాసముల వరకు తన సమయము నిచ్చి మేనేజరుగా సహాయపడ టానికి సిద్ధపడినాడు. ఈ విధంగా కొన్ని మాసములు జరిగిన తరువాత 1928వ సంవత్సరము ఆరంభము నుంచి ఇంకొక యువకుడు, నాకు సహాయపడటానికి సంసిద్ధుడైనాడు.

ఆయన ఉస్మానియా విశ్వవిద్యాల యపు పట్టభద్రుడు బషీర్ అహ్మద్ తాహీర్. మంచి జాతీయవాది, దేశభక్తుడు. తాహీర్ సహాయ సంపాదకుడుగా నాకు తోడ్పడే వాడు. 1920 సంవత్సరంలో ‘రయ్యత్’ పత్రిక ప్రభుత్వముచే ఆపివేయబడే వరకు నాతో పని చేసినాడు. తదనంతరము, బషీర్ అహ్మద్ తాహీర్ ప్రభుత్వ ఉద్యోగిగా చేరి, తాహశీల్దారుగా నియమింపబడ్డారు. కొద్దికాలము క్రిందటనే జిల్లా కలెక్టరుగా, ఆంధ్రప్ర దేశ్ ప్రభుత్వ సర్వీసు నుంచి పెన్షన్‌పైన తమ పదవిని విరమించుకున్నాడు. పత్రికలకు ముఖ్య ఆధారము ప్రకటనలు. కాని, ‘రయ్యత్’కు అటువంటి ఆధారము లభించలేదు. చదువరులిచ్చు వార్షిక చందాలే ఆధారము కావున, యెప్పుడు లోటు బడ్జటే! ఎప్పుడూ నాకు ఆర్థిక బాధలే. ఇట్లా బాధ పడుచున్న ప్రతి సమయాన శ్రీ కిషన్- (బ్యారిస్టర్) నన్ను ఆదుకునేవారు. వారు విరాళాల రూపములో ఎక్కడి నుంచైనా డబ్బు తీసుకు వచ్చేవారు. నవాబు సాలార్ జంగ్, రాజా ధస్రాజ్‌గిర్ జీ, రాజా ప్రతాపగిర్ జీ ప్రముఖ దాతలు.

పత్రికలు, పత్రికాధిపతుల బాధ్యతలు

వాక్స్వాతంత్య్రం, బహిరంగ సభలు పెట్టుకునే స్వేచ్ఛ లేని రాష్ట్రములో కొంతవరకైనా పత్రికల ద్వార చైతన్యము కలిగించ వచ్చునని నేను నమ్మేవాడిని. ఆ నమ్మకముతో పత్రికా రచన ఆరంభించినాను. శాసనసభలు లేని, ప్రభుత్వమును విమర్శించే వ్యతిరేక పక్షం లేని పరిపాలనలో, పత్రికల ప్రాముఖ్యత చాలా ఉంటుందని గ్రహించినాను. రాజకీయపార్టీలు లేని రాజ్యములో ప్రజాభిప్రాయ ము కల్గించడము, ప్రజాసమస్యలను యెదుర్కొనడము, ప్రజల కష్టసుఖాలు ప్రభుత్వ దృష్టిలోకి తేవడము వంటివన్నీ పత్రికల బాధ్యత. నిద్రిస్తున్న యజమానిని కావలి కాసే కుక్క యే విధంగా మేల్కొలుపుతుందో, అదే విధంగా నిద్రిస్తున్న ప్రజలను మేల్కొలిపి, తమ ప్రజాస్వామ్య హక్కులు సాధించు కొనుటకు సిద్ధ పరచడమే ‘రయ్యత్’ బాధ్యత అని తలచి, సమస్యలు చర్చించేవాడిని. అంతవరకు ప్రభుత్వ అధికారులను పొగడుతూ వచ్చిన ఆచారానికి భిన్నంగా, వారు అవలంబించే అవకతవక చర్యలను బాగా విమర్శించే వాడిని. ప్రభుత్వమంటే ప్రజల్లో వున్న భయ ము పోగొట్టవలెనను దృష్టితో కొన్నికొన్ని పర్యాయములు ఘాటుగా విమర్శించే వాడిని.

ప్రచురణ కాలం: 1977 (‘50 సంవత్సరముల హైదరాబాదు’ నుంచి..)

న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి!

ఇదే కాలములో నేను న్యాయవాద వృత్తి అవలఁబించినాను. నా తమ్ముడు మందుముల రామచంద్రరావు ఈ అధ్యాయము వ్రాస్తుండగా మూడు రోజుల క్రిందట 1978 డిశంబరు 11న  ఉదయము 8.-15 గంటలకు స్వర్గస్తుడైనాడు. రామచంద్రరావు నాకంటే మూడు సంవత్సరాలు చిన్న. ఆయన వయస్సు 74 సంవత్సరములు. నేనూ మా తమ్ముడు ఉభయులము ఒక జతన చదువుకున్నాము. సమిష్టి కుటుంబ సభ్యులుగా 1959 వరకు జీవితము గడిపినాము. నేను 6 సంవత్సరాలు ప్రాక్టీసు చేసిన పిదప ఈ వృత్తికి తగిన వాడిని గానని గ్రహించినాను. ఈ వృత్తిలో నేను సంపూర్ణముగా విఫలుడననిపించుకున్నాను. కావున, న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పి, 1927 నుంచి ‘రయ్యత్’ అను ఉర్దూ వారపత్రిక సంపాదకునిగ కొత్త జీవితము ఆరంభించితిని.