calender_icon.png 20 March, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్

20-03-2025 12:59:17 AM

  1. రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకున్న అమెరికా కంపెనీ
  2. సీఎం రేవంత్‌రెడ్డితో సంస్థ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. బుధవారం ఉదయం అసెంబ్లీలోని చాంబర్‌లో మెక్‌డొనాల్డ్స్ చైైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీతో పాటు సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చలు జరిపారు.

అనంతరం సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ ఆఫీస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2,000 మంది ఉద్యోగులతో ఈ ఆఫీసును ప్రారంభించనుంది. ఈ సందర్భంగా తమ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి మెక్ డొనా ల్డ్స్ సంస్థ రాష్ర్ట ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది.

మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకురావటంపై సీఎం రేవంత్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సెంటర్‌ను తమ రాష్ర్టంలోనే ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాలు పోటీపడుతున్న సందర్భంలో మెక్‌డొనాల్డ్ సంస్థ తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవటం గర్వంగా ఉందన్నారు. ప్రభుత్వం తరఫున అత్యుత్తమ సహకారం అందిస్తామన్నారు. 

స్కిల్స్ యూనివర్సిటీ సేవలను వినియోగించుకోండి.. 

సంస్థకు అవసరమైన శిక్షణ నైపుణ్యమైన ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. యూనివర్సిటీని స్కిల్ జోన్‌గా ఉపయోగించుకొని, ఇక్కడ శిక్షణ పొందినవారికి గ్లోబల్ ఆఫీస్‌లోనే కాకుండా, దేశ విదేశాల్లో తమ ఆఫీసులు, అవుట్‌లెట్లలో ఉద్యోగాలు కల్పించాలన్నారు.

మెక్‌డొనాల్డ్స్‌కు అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులు సమకూర్చేలా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కోరారు. దీంతో రైతుల ఆదాయం పెరుగుతుందని, రాష్ర్ట వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.

బెంగళూరులాంటి ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన నిపుణులతో పాటు మెరుగైన మౌలికసదుపాయాలు, నాణ్యమైన జీవనప్రమాణాలున్నాయని మెక్‌డొనాల్డ్ సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీ అన్నారు. అందుకే హైదరాబాద్‌ను తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్‌గా ఎంచుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో 38మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్లున్నాయి. ప్రతీ ఏడాది మరో 4 కొత్త అవుట్ లెట్లను విస్తరించే ప్రణాళికలున్నాయి.

కొత్తగా గ్లోబల్ ఇండియా ఆఫీసు ఏర్పాటుతో రాష్ర్టంలోని యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధుల బృందంలో సీఈవోతో పాటు గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కు ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండియా హెడ్ దేశాంత కైలా ఉన్నారు.