calender_icon.png 11 January, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీని సందర్శించిన యూపీ మేయర్లు

01-08-2024 08:30:00 AM

గ్రేటర్‌లో వరద, విపత్తుల నిర్వహణపై అధ్యయనం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ అనుసరిస్తున్న వరద నిర్వహణ, క్రమబద్ధీకరణ పద్ధతులు, విపత్తుల నిర్వహణ, బెస్ట్ ప్రాక్టీసెస్ బాగున్నాయని ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు మేయర్లు ప్రశంసించారు. ఆ రాష్ట్రంలోని కాన్పూర్, లక్నో, గోరఖ్‌పూర్, అయోధ్య పట్టణాలకు చెందిన మేయర్ల బృందం బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు. జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రేటర్‌లో అమలు చేస్తున్న వివిధ పథకాలను మేయర్ వారికి తెలియజేశారు. ప్రతి బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని, అందులో సభ్యులు, అధికారులు పాల్గొ ని ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చిస్తామని వారికి తెలిపారు.

డీఆర్‌ఎఫ్, ఇతర విభాగాల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం బుద్ధ భవన్‌లో నాలా డెవలప్‌మెంట్ ప్రో గ్రాం, డీఆర్‌ఎఫ్ చేస్తున్న పనులకు సంబంధించిన విషయాలను హైడ్రా కమిషనర్, ఐజీ రంగనాథ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నగరంలోని వాతావరణ పరిస్థితులు, కంట్రోల్ రూమ్ ద్వారా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల పర్యవేక్షణ, వాతావరణ అప్డేట్స్, వర్షపాతం నమోదు, వర్షాలు, వరదలను ఎదుర్కొంటున్న విషయాల గురించి కంట్రోల్ రూంను సందర్శించిన సందర్భంగా ఓఎస్‌డీ అనురాధ వివరించారు. కార్యక్రమంలో మేయర్లు మంగ్లేష్‌కుమార్ శ్రీవాత్సవ, ప్రమీలపాండే, సుష్మా కరక్‌వాల్, గిరీష్‌పాటి త్రిపాఠి, జీహెచ్‌ఎంసీ ఎస్‌ఈ కోటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.