కరీంనగర్,(విజయక్రాంతి): నగర ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అందమైన మల్టిపర్పస్ పార్కు, స్పోర్ట్స్ కమర్షియల్ కాంప్లెక్స్, 24/7 వాటర్ సప్లై, ఈ క్లాస్ రూమ్స్ తదితర ప్రాజెక్టులను 24 వ తేదీన ఘనంగా ప్రారంభోత్సవాలు చేస్తామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో నగరంలో నూతనంగా అభివృద్ధి చేసిన మల్టిపర్పస్ పార్క్, స్పోర్ట్స్ కమర్షియల్ కాంప్లెక్స్ ను అధికారులతో కలిసి సందర్శించారు. చివరి దశ పనులను తనిఖీ చేసి పరిశీలించి... ప్రారంభోత్సవాలకు సిద్దం చేసి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.... కరీంనగర్ నగర ప్రజలకు అహ్లదకర వాతావరణంతో ఆనందం పంచే విధంగా 13 కోట్ల రూపాయల తో మల్టిపర్పస్ పార్క్ ను సుంధీకరించామని తెలిపారు.
పార్కులో చిన్నారు చిందులేసేలా ఆట స్థలం పరికరాలు, పచ్చదనం పంచే అందమైన లాండ్ స్కేపింగ్, చూపరులను ఆకట్టుకునేలా మ్యూజికల్ పౌంటెన్, ఆంఫీథియేటర్, గజీభో, మ్యూజికల్ పౌంటెన్ ఏర్పాటు చేసి అందంగా ముస్తాబు చేశామని తెలిపారు. మరో వైపు స్థానిక అంభేడ్కర్ స్టేడియం లో స్పోర్ట్స్ కమర్షియల్ కాంప్లెక్స్ భవనాన్ని అన్ని రకాల వసతులతో నిర్మాణం చేశామని స్పష్టం చేశారు. అంతే కాకుండా ప్రజలకు ప్రతి రోజు త్రాగు నీరు అందించాలనే గొప్ప సంకల్పంతో హౌజింగ్ బోర్డు రిజర్వాయర్ పరిదిలో ప్రయోగాత్మకంగా 24/7 వాటర్ సప్సై ప్రాజెక్టును కూడ పూర్తి చేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టెక్నాలజీ తో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ క్లాస్ రూమ్స్ ప్రాజెక్టును పూర్తి చేసి... పలు ప్రభుత్వ పాఠశాలలను అందంగా అధునీకరించి విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. స్మార్ట్ సిటీలో తీర్చిదిద్దిన ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్ర గౌరవ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా 24 వ తేదీన ఘనంగా ప్రారంభం చేసి వాటి ఫలాలను ప్రజలకు అందిస్తామని తెలిపారు.
ప్రారంభోత్సవాల అనంతరం గౌరవ ముఖ్య అతిథులతో కలిసి హౌజింగ్ బోర్డులో ప్రజలతో కలిసి సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రారంభోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని... అన్ని ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలకు సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అభివృద్ధి చేసిన ప్రాజెక్టుల చివరి దశ పనులను కూడ పరిశీలించి అధికారులకు ప్రారంభోత్సవాలకు సంబంధించి సలహాలు, సూచనలు చేసినట్లు తెలిపారు. మా పాలకవర్గ ఆయాంలో ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం, పాలకవర్గం, ప్రజల సహకారంతో కరీంనగర్ నగరపాలక సంస్థ లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని తెలిపారు. జరిగిన అభివృద్ధి పట్ల ప్రజలతో పాటు మా పాలకవర్గం చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తుందని తెలిపారు. ఇదే అభివృద్ధి కరీంనగర్ నగరపాలక సంస్థ పరిదిలో నిరంతరంగా కొనసాగి... ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు కూడ రాబోయే రోజుల్లో అందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ యాదగిరి, డఈ అయూబ్ ఖాన్, ఏఈ లు, ఏజెన్సీ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.