మండిపడిన బీసీ సంఘాల నాయకులు
కరీంనగర్ సిటీ, ఆగస్టు 26: బడుగు, బలహీనవర్గాలను కరీంనగర్ నగర మేయర్ సునీల్‌రావు అణగదొక్కుతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం, రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ మండిపడ్డారు. సోమవారం నగరంలోని తారక్ హోటల్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మేయర్ సునీల్‌రావు తన వ్యక్తిగత పర్యటన కోసం విదేశాలకు వెళ్లాడన్నారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణికి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించలేదన్నారు.
రాజకీయ కుట్రలో భాగంగానే డిప్యూటీ మేయర్ బీసీ వర్గానికి చెందిన మహిళ కావడంతో ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వలేదని దుయ్యబట్టారు. డిప్యూటీ మేయర్‌ను రాజకీయ వివక్షకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్ ప్రభుత్వానికి, కలెక్టర్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అమెరికా పర్యటన వెళ్లడాన్ని తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ నగరంలో జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మేయర్‌ను వెంటనే రప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శంకర్, అజయ్ పటేల్, కోటేశ్వర్, రమేశ్, తిరుపతి పాల్గొన్నారు.